లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టి ప్రాజెక్టులో బీఆర్ఎస్ అవినీతి దేశమంతా తెలుసన్నారు మంత్రి సీతక్క. వాళ్ల తప్పిదాలు కప్పిపుచ్చుకునేందుకు పదేపదే విమర్శలు చేస్తున్నారని చెప్పారు. మూసీ నదీ ఆక్రమణల కారణంగా నష్టాలున్నాయని.. గత పదేళ్లలో అనేక అక్రమ కట్టడాలు నిర్మించారని తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతంలో సాధారణ ప్రజలకంటే ఎక్కువగా రాజకీయ నాయకులే భవనాలు కట్టుకుని అద్దెకిచ్చారని ఆరోపించారు.మూసీ పరివాహక ప్రాంతంలో ఇండ్లు కోల్పోతున్న పేదలకు స్థిర నివాసం కల్పిస్తామని చెప్పారు సీతక్క.
ALSO READ | ఆవేదనతో ఉన్నా.. అన్నం కూడా తినలే: మంత్రి కొండా సురేఖ కంటతడి
హరీశ్ రావు, కేటీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. మిడ్ మానేరు, మల్లన్నసాగర్ లో నిర్వాసితులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత బలవంతంగా ఖాళీ చేయించిందో అందరికి తెలుసన్నారు. బీఆర్ఎస్ హయాంలో బలవంతంగా కూల్చొచ్చు కానీ... ఇప్పుడు ఆక్రమ నిర్మాణాలు కూల్చుతుంటే రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చెరువులు, నాలాలు ఆక్రమించుకుని కట్టుకున్న వారిపై చర్యలు తీసుకుంటే.. ఇపుడు మద్దతిస్తున్నారని విమర్శించారు. టీవీల్లో, సోషల్ మీడియాలో తమను ఇష్టానుసారంగా తిట్టిస్తున్నారని చెప్పారు సీతక్క.
ఖమ్మం, మహాబూబాబాద్ లో వచ్చిన వరదలకు ఆక్రమణలే కారణమన్నారు మంత్రి సీతక్క. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలన్నారు. 70 ఏళ్లలో విధ్వంసం జరిగిందని చెప్పి.. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా అనుమతులిచ్చారని చెప్పారు. సాధారణ ప్రజలకు నష్టం కలగకుండా చూస్తామన్నారు సీతక్క. మూసినదీ, చెరువుల్లో ఎవరు తెలిసి కట్టారో.. ఎవరు తెలవకుండా కట్టారనేది తేల్చుతామన్నారు.