- ఢిల్లీలో జరిగిన పెసా యాక్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ లో మంత్రి సీతక్క
- గనుల తవ్వకాలతో పోల్చితే సౌలతుల ఏర్పాటుకు పర్మిషన్స్ వేగంగా వస్తలే
- తెలంగాణతో పాటు మరో 10 రాష్ట్రాల్లో అభివృద్ధి పనులకు బ్రేక్
- గ్రామ సభలకు అనుమతివ్వాలని కేంద్రానికి సూచన
న్యూఢిల్లీ, వెలుగు: గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు అటవీ శాఖ అనుమతులు అడ్డంకిగా మారుతున్నాయని మంత్రి సీతక్క అన్నారు. కనీస వసతులు కల్పించడానికి కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఓ గిరిజన ప్రాంతంలో స్కూల్ బిల్డింగ్ నిర్మాణానికి అనుమతి లేకపోవడంతో కంటైనర్ పాఠశాలను ఏర్పాటు చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఇలా.. రోడ్లు, మంచినీటి వ్యవస్థ, స్కూల్స్, విద్యుత్, హెల్త్ సెంటర్లు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణాలకు అటవీ చట్టాలు ఆటంకం కలిగిస్తున్నాయని వివరించారు.
గురువారం ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో పెసా యాక్ట్ పై కేంద్రం సర్కార్ నిర్వహించిన నేషనల్ కాన్ఫరెన్స్ లో సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.." పెసా యాక్ట్ అమలుతో తెలంగాణతో పాటుమరో 10 రాష్ట్రాల్లో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో గనులు, భారీ ప్రాజెక్టులకు అనుమతులు వేగంగా మంజూరు అవుతున్నాయి. కానీ అడవి పుత్రులకు కనీస సదుపాయాలు కల్పించే విషయంలో మాత్రం అనుమతులు రావడం లేదు.
కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీమ్ ల ద్వారా నిధులు ఇస్తున్నప్పటికీ అటవీ అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో ఆ నిధులు మురిగిపోతున్నాయి. ఇనాటికి అనేక గిరిజన గ్రామాలకు సరైన రోడ్డు, విద్యుత్తు సదుపాయం, ఇతర మౌలిక వసతులు లేవు. అటవీ ప్రాంత గ్రామాల అభివృద్ధికి గ్రామ సభలకు అధికారం ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నా" అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
పేదలకు న్యాయం చేస్తం
చెరువులను కాపాడి భవిష్యత్ తరాలకు అందించాలనే హైడ్రా హైదరాబాద్ లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నదని మంత్రి సీతక్క తెలిపారు. మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం ప్రజల నుంచి హైడ్రా లాంటి వ్యవస్థలను ఏర్పాటు చేయాలనే డిమాండ్ వస్తుందన్నారు. కూల్చివేతల్లో పేదవాళ్ల ఇండ్లు ఉంటే న్యాయం చేస్తామని ఇప్పటికే సీఎం హామీ ఇచ్చారని, వారికి త్వరలోనే వేరే చోట డబుల్ బెడ్ రూమ్స్ ఇండ్లు కేటాయిస్తామని వెల్లడించారు.