బీజేపీకి బీటీమ్ బీఆర్ఎస్..​మహారాష్ట్రలో కాషాయం కోసం పనిచేస్తుంది: మంత్రి సీతక్క

బీజేపీకి బీటీమ్ బీఆర్ఎస్..​మహారాష్ట్రలో కాషాయం కోసం పనిచేస్తుంది: మంత్రి సీతక్క
  • మహారాష్ట్రలో కాషాయపార్టీకి లబ్ధి చేకూర్చేలా కుట్ర 
  • త‌ప్పుడు పబ్లిసిటీ చేస్తూ ప్రజాప్రభుత్వంపై విషం చిమ్ముతోంది
  • కేసుల నుంచి తప్పించుకునేందుకే :మంత్రి సీతక్క

హైదరాబాద్: బీజేపీకి బీ టీంగా బీఆర్ఎస్ ప‌నిచేస్తోందని మంత్రి సీతక్క ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ వ‌చ్చిన నాటి నుంచి ప‌క్కా ప్రణాళిక‌తో  విష ప్రచారం చేస్తుందని ఫైర్​అయ్యారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు కాషాయపార్టీతో అంట‌కాగుతోందన్నారు. సెక్రటేరియట్​లో మంత్రి సీత‌క్క మాట్లాడుతూ ‘మహారాష్ట్రలో బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు బీఆర్ఎస్ కుట్ర పూరితంగా వ్యవ‌హ‌రిస్తోంది. పదే ప‌దే త‌ప్పుడు పబ్లిసిటీ చేస్తూ ప్రజా ప్రభుత్వంపై విషం చిమ్ముతోంది.

  అందులో భాగంగా ఫ్రీ బస్‌ జర్నీ స్కీంపై  దుష్ప్రచారం చేస్తోంది.​ కోట్లాదిమంది మహిళలకు అన్యాయం చేసేలా కుట్రలుల ప‌న్నుతోంది. పంట రుణ‌మాఫీని చేయ‌ని బీఆర్ఎస్ ఇప్పుడు రైతుల ప్రేమ కురిపించ‌డం విడ్డూరంగా ఉంది. ప్రజా ప్రభుత్వం కేవలం 27 రోజుల్లోనే 18 వేల కోట్ల పంట రుణాల‌ను మాఫీ చేసింది. 6 మాసాల్లోనే మేం 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. వచ్చే నాలుగేండ్లల్లో 6 గ్యారెంటీలను పూర్తిగా అమలు చేస్తం’ అని తెలిపారు.

బీఆర్ఎస్ ను నిలదీయండి

కుల‌గ‌ణ‌నను అడ్డుకుంటున్న బీఆర్ఎస్ ను బీసీ సంఘాలు నిల‌దీయాలని సీతక్క సూచించారు. జనాభా లెక్కలు తెలిస్తేనే సంక్షేమ వాటా సాధ్యమవుతుందని తెలిపారు. ఇంటింటి స‌మ‌గ్ర స‌ర్వేను బ‌హిష్కరించ‌డం అంటే మన హక్కులను, అభివృద్ధిని వదులుకోవడమే అవుతుందన్నారు. ‘మేమెంతో.. మాకంత’ అన్న నినాదం నిజం కావాంలే స‌మ‌గ్ర సర్వేలో వివ‌రాలు న‌మోదు కావాలన్నారు. క్లబ్బులు, ప‌బ్బులు బంద్ అయ్యాక కొంతమంది అరాచ‌కంగా తయారవుతున్నారని చెప్పారు. గ‌త పదేండ్లలో జ‌రిగిన న‌ష్టాన్ని ప్రజ‌లు బేరీజు వేసుకోవాలని కోరారు.

ALSO READ | కేటీఆర్.. ఇప్పటికైనా తప్పు ఒప్పుకుంటే మంచిది: మంత్రి పొన్నం