
సూర్యాపేట, వెలుగు : కరప్షన్ కు బ్రాండ్ అంబాసిడర్ బీజేపీ ప్రభుత్వమని, అంబానీలకు పేదల సంపదను ప్రధాని మోదీ దోచిపెట్టారని పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధిశాఖ మంత్రి సీతక్క ఆరోపించారు. హుజూర్నగర్ లో జరగనున్న సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభం సభలో హాజరయ్యేందుకు వెళ్తూ ఆదివారం సూర్యాపేటలో తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి నివాసంలో కొద్దిసేపు ఆగారు. రాష్ట్రానికి కాంగ్రెస్ కరెక్షన్ వైరస్ సోకిందని, తెలంగాణలో సన్న బియ్యం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి 12 ఏండ్లలో పేదలకు సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన ఎందుకు రాలేదో బండి సంజయ్ చెప్పాలన్నారు. కేంద్రంలో బీజేపీకి అధికారం ఇస్తే గ్రామాల్లోకి అక్షింతలు పంచారే తప్ప.. అభివృద్ధి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతం, దేవుడి పేరుతో ప్రజల మధ్య ఐక్యతను చెడగొట్టాలని చూస్తున్నదని ఫైర్ అయ్యారు. అంబానీలకు దేశ సంపదను దోచిపెట్టి బీజేపీ నాయకులు వాటాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
2013లో ఆహార భద్రత చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమని గుర్తు చేశారు. కాంగ్రెస్ తెచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రజలు తినడానికి బియ్యం లేని రోజుల నుంచి ఈరోజు సన్నబియ్యం ఇచ్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం నుంచి పనుల రూపంలో ఒక రూపాయి పంపిస్తే 48 పైసలే తిరిగి వస్తున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పథకాలకు రాష్ట్ర ముఖ్యమంత్రుల ఫొటోలు పెడతారా..? అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ లో ఉన్నందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిగ్గు పడాలి..
బీఆర్ఎస్ లో ఉన్నందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిగ్గుపడాలని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిపై ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డిది రాక్షస పాలన, రాబందుల పరిపాలన అని ప్రవీణ్కుమార్చెప్పడం సరికాదన్నారు. బీఎస్పీలో ఉన్నప్పుడు కేసీఆర్ ది పాలన రాక్షస పాలన అని, బీఆర్ఎస్లో చేరినాక కాంగ్రెస్ ది రాక్షసపాలన అని ప్రవీణ్‌కుమార్ చెప్పడం సిగ్గుచేటన్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ అపాయింమెంట్ఇవ్వట్లేదని ప్రవీణ్ కుమార్ గతంలో అనలేదా..? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కీలక మార్పులు తీసుకొస్తున్నారని తెలిపారు. సామాజిక న్యాయం కోసం సీఎం రేవంత్ రెడ్డి విప్లవాన్ని తీసుకొస్తున్నారని ఎంపీ పేర్కొన్నారు. అనంతరం మంత్రి, ఎంపీని పటేల్ రమేశ్ రెడ్డి సన్మానించారు.