మహిళా కూలీల ఖాతాల్లో ఆత్మీయ భరోసా : మంత్రి సీతక్క

  • జనవరి 26  నుంచి నాలుగు పథకాల అమలు: మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: భూమిలేని ఉపాధి కూలీలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ కింద ఏడాదికి రూ.12 వేల ఆర్థిక చేయూత అందించబోతున్నామని మంత్రి సీతక్క తెలిపారు. నేరుగా మహిళా కూలీల బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ చేస్తున్నామని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం లేదని అన్నారు.  హైదరాబాద్​ ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ కార్యాలయంలో శనివారం డీఆర్డీవోలతో మంత్రి రివ్యూ నిర్వహించి స్కీమ్ అమలుపై దిశానిర్దేశం చేశారు.

తర్వాత సీతక్క మాట్లాడుతూ..  26వ తేదీ నుంచి నాలుగు ప్రతిష్టాత్మక పథకాలను ప్రభుత్వం ప్రారంభించనున్నదని చెప్పారు. తమ ప్రభుత్వం మహిళా పక్షపాతి అని,  అందుకే మహిళల ఖాతాల్లోకి నగదు బదిలీ చేస్తున్నామని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తామన్నారు. ‘‘ఉపాధి హ‌‌మీ కూలీల ఆధార్ నెంబ‌‌ర్లను స‌‌రిగ్గా న‌‌మోదు చేయ‌‌లేదు. డేటా న‌‌మోదులో జ‌‌రిగిన పొర‌‌పాట్లను సరిదిద్దేలా చ‌‌ర్యలు తీసుకోవాలి.

న‌‌ల్గొండ‌‌లో 99 మంది పంచాయతీ కార్యద‌‌ర్శులు అనుమ‌‌తులు లేకుండా విధులకు నెల‌‌ల త‌‌ర‌‌బ‌‌డి గైర్హాజ‌‌ర‌‌య్యారు.. అందుకే వారి స‌‌ర్వీస్ బ్రేక్ చేయాల్సి వ‌‌చ్చింది. ఏ స్థాయి అధికారులైనా అనుమ‌‌తులు లేకుండా విధుల‌‌కు హాజరుకాకపోతే చ‌‌ర్యలు త‌‌ప్పవు’’ అని సీతక్క హెచ్చరించారు. సమీక్షలో పీఆర్, ఆర్ డీ కార్యదర్శి లోకేశ్ కుమార్, డైరెక్టర్ సృజన, డీఆర్డీ వో లు పాల్గొన్నారు.