- డిమాండ్లు నెరవేర్చేందుకు కృషి చేస్తానని హామీ
హైదరాబాద్, వెలుగు: ప్రతి నెలా ఐదో తేదీలోపు సీఆర్టీల జీతాలు చెల్లించేందుకు కృషి చేస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. మహిళా టీచర్లకు 180 రోజుల ప్రసూతి సెలవులు, డెత్ బెనిఫిట్స్ మంజూరు చేస్తామని తెలిపారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ సమ్మెకు దిగిన కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ల (సీఆర్టీ)తో మంత్రి సీతక్క జరిపిన చర్చలు సఫలం అయ్యాయి.
సెక్రటేరియెట్లోని తన పేషీలో సీఆర్టీ ప్రతినిధులతో ఆమె భేటీ అయ్యారు. రెగ్యులరైజేషన్, మినిమం టైమ్ స్కేల్ మినహా అన్ని డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో సమ్మె విరమిస్తున్నట్లు సీఆర్టీలు ప్రకటించారు. శనివారం నుంచి విధుల్లో చేరుతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు. పదేండ్లుగా సమస్యలు పెండింగ్లో ఉన్నాయని, ఒక్కో దాన్ని పరిష్కరిస్తున్నామని వెల్లడించారు.