- నాగోబా దర్బార్‌లో వినతుల స్వీకరణ
గుడిహత్నూర్, వెలుగు : ప్రజా అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, సమస్యల తక్షణ పరిష్కారానికి కృషి చేస్తామని ఆదిలాబాద్ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్, మంత్రి సీతక్క అన్నారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతర చివరి రోజు జరిగే దర్బార్‌కు మంత్రి సీతక్క హజరై మాట్లాడారు. ఆదివాసీల సమస్యలు తనకు పూర్తిగా తెలుసని, వాటి పరిష్కారం కోసం కట్టుబడి ఉన్నామన్నారు. సోమవారం నాగోబా ఆలయానికి చేరుకున్న మంత్రి సీతక్క ముందుగా స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఎంపీ సోయం బాపూరావు, కలెక్టర్ రాహుల్ రాజ్, పీఓ ఖుష్బూ గుప్తా, ఎస్పీ గౌస్ ఆలం
స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి నాగోబా ను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని గోవాడను సందర్శించి మెస్రం వంశ కోడళ్లతో ముచ్చటించారు. అనంతరం మెస్రం వంశీయులు మంత్రి,ఎంపీ, ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులను శాలువాతో సత్కరించి, ప్రసాదం అందజేశారు. అనంతరం ఆలయ ఆవర ణలో ఉన్న కుమ్రంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలి
దర్బార్‌లో ఎంపీ సోయం బాపూరావు మాట్లా డుతూ.. కేంద్ర ప్రభుత్వం పీవీటీజీల కోసం జన్‌మన్ పథకాన్ని అమలు చేస్తున్నారని, అర్హులైనవారు వినియోగించుకోవాలన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ, గిరిజనులు ఎర్కొంటున్న విద్యుత్, అటవీ, పోడు పట్టాల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏజెన్సీ ప్రజలు తమ సమస్యలు విన్నవించుకోవడానికి నాగోబా దర్బార్ వచ్చే ఏజెన్సీ ప్రజల సమస్యలను అధికారులు పరిష్కరించాలని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సూచించారు. నాగోబా ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు.
ప్రధానంగా విద్య, వైద్యం, ఉపాధి కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. నాగోబా జాతరలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో విద్యా, వైద్యం, వ్యవసాయం, విద్యుత్, రహదారులు, తాగునీరు, పోడు భూములు తదితర సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జి.నగేశ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావు పటేల్, మెస్రం వంశీయులు పాల్గొన్నారు. దర్బార్సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఉట్నూర్ సీహెచ్‌సీలో టీ హబ్ ప్రారంభం
ఉట్నూర్ : ఏజెన్సీ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి సీతక్క అన్నారు. ఉట్నూర్ మండల కేంద్రంలోని సీహెచ్‌సీ అవరణలో టీ హబ్‌ను ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత వాసులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. టీ హబ్ ద్వారా గిరిజనులకు అన్ని రకాల మెడికల్ టెస్టులు చేయడంతో పాటు కావాల్సిన వైద్య సేవలు అందుతాయన్నారు.