- బీఆర్ఎస్పై మండిపడ్డ మంత్రి సీతక్క
అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు : బీఆర్ఎస్నేతలు కాంగ్రెస్ మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తోందని పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారంలోని గడ్డిఅన్నారం ప్రూట్ మార్కెట్ పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మార్కెట్ కమిటీ చైర్మన్గా చిలుక మధుసూదన్ రెడ్డి, వైస్ ఛైర్మన్ గా భాస్కరాచారి, 12 మంది డైరెక్టర్లు, ఇద్దరు ఎక్స్ అఫిషియో మెంబర్లతో మార్కెట్ సెక్రెటరీ శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తుంటే ఓర్వలేక.. బీఆర్ఎస్విష ప్రచారం చేస్తోందన్నారు. పదేండ్లలో రూ.లక్ష కూడా రుణమాఫీ చేయని బీఆర్ఎస్ ఇప్పుడు రైతుల కోసం ధర్నాలు, ఆందోళనలంటూ డ్రామాలు చేస్తోందన్నారు. గడ్డిఅన్నారం మార్కెట్ ను బీఆర్ఎస్ ఆగం చేసిందన్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం వచ్చాక ఫైల్స్తీసి చూస్తే అన్ని శాఖల్లో అప్పులే కనిపించాయన్నారు.
వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్న గడ్డిఅన్నారం మార్కెట్ ను చిన్నదొర రూ.75 లక్షల రెంటు చెల్లించే విధంగా చేశాడని విమర్శించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ సీఎం అన్ని వర్గాలకు మంచి చేయాలని చూస్తుంటే బీఆర్ఎస్ దుష్ప్రచారం చేసే కార్యక్రమం పెట్టుకుందన్నారు. రోడ్డు డెవలప్మెంట్కార్పొరేషన్ చైర్మన్మల్రెడ్డి రాంరెడ్డి, ఎమ్మెల్సీలు మల్లేశం, బుగ్గారపు దయానంద్, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్మధుయాష్కీ పాల్గొన్నారు.