
హైదరాబాద్: రాజీవ్ యువ వికాస పథకంలో దివ్యాంగులకు ఐదు శాతం కేటాయిస్తామని మంత్రి సీతక్క అన్నారు. కుటుంబంలో దివ్యాంగులుంటే.. వారి పేరు మీదే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే అంశం ప్రభు త్వ పరిశీలనలో ఉందన్నారు. ఇవాళ మంత్రి ఛాంబర్ లో మహిళ శిశు సంక్షేమ శాఖపై అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ... మహిళా శిశు సంక్షేమ శాఖలోని అన్ని విభాగాలు నిర్దిష్ట గడువును నిర్దేశించు కుని ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని సూచించారు. 'ప్రతి మూడు నెలలకోసారి పూర్తి స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తం. ఆరేండ్ల లోపు చిన్నారులంతా అంగన్వాడీ కేంద్రాల్లో ఉండేలా చూడాలి.. పిల్లల దత్తత ప్రక్రియను వేగవంతం చేయండి. దివ్యాంగులకు అత్యవసరమైన సర్జరీలను ప్రభుత్వమే చేయిస్తుంది. దీనికి అనుగుణంగా దివ్యాంగులను గుర్తించి అధికా రులు సర్జరీ ఏర్పాట్లు చేయాలి. అంగన్వాడీ కేంద్రాల్లో సరఫరా అయ్యే ఆహార నాణ్యత మరింత రుచికరంగా మార్చేందుకు ఎన్, యూనిసెఫ్ వంటి సంస్థలు, నిపుణులతో కమిటీ వేశాం.
14 - 18 ఏండ్లలోపు కిషోర బాలికలకు పల్లీ పట్టీ, చిరుధాన్యాల పట్టీలు అందిస్తం. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ స్కీంను అమలు చేస్తం. హైదరాబాద్, రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల్లో 23 మొబైల్ అంగన్వాడీ వాహనాలను ఏర్పాటు చేసి అర్హులందరికీ గుడ్లు, ఆహారం చేస్తున్నం. ప్రతి మండలంలో కనీసం 3 అంగన్వాడీ భవనాలను నిర్మించే పనులను ప్రారంభిం చండి' అని సీతక్క అధికారులను ఆదేశించారు.