
జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వెలుగు: డాక్టర్లు దేవుళ్లతో సమానమని, అలాంటి పవిత్రమైన వృత్తిలో ఉండి కూడా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో రాత్రిపూట డాక్టర్లు అందుబాటులో ఉండకపోవడమేంటని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ములుగు జిల్లా ఆస్పత్రిని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. రాత్రి వేళల్లో డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదని తెలుసుకున్న మంత్రి సూపరింటెండెంట్ జగదీశ్వర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆస్పత్రి మీటింగ్ హాల్ లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, ప్రోగ్రాం ఆఫీసర్స్, మెడికల్ ఆఫీసర్స్, సూపరిండెంట్, జిల్లా వైద్య నిపుణులు, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్, సిబ్బందితో మంత్రి కలెక్టర్ దివాకర, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ తో కలిసి ప్రత్యేకంగా సమావేశమై పీహెచ్సీల వారీగా సమీక్షించారు. ప్రభుత్వ హాస్పిటల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా వైద్యసేవలు అందించాలన్నారు. ఎమర్జెన్సీ టైంలో మెరుగైన వైద్య సేవలకోసం 108 సిబ్బంది 15 నిమిషాల్లో ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించాలన్నారు.