ములుగు మండలంలో తండాలకు, గూడాలకు లింక్​ రోడ్లు

ములుగు మండలంలో తండాలకు, గూడాలకు లింక్​ రోడ్లు
  • పంచాయతీరాజ్​ ద్వారా రూ.12వేల కోట్ల కేటాయింపు
  • మంత్రి దనసరి అనసూయ (సీతక్క)

ములుగు, వెలుగు : జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రతీ చిన్న గ్రామం, తండాలు, గూడానికి లింకు రోడ్లను నిర్మిస్తున్నామని, ప్రతీ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తామని   మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. పనులను  నాణ్యతతో  చేపట్టాలని  సూచించారు. మంగళవారం ములుగు మండలంలో ఆమె  పర్యటించారు. -  మండలంలో రూ.5కోట్ల నిధులతో పలు రోడ్లకు శంకుస్థాపనలు చేశారు.  అనంతరం మంత్రి మాట్లాడారు.  రాష్ట్రంలో అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయడానికి పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ.12 వేల కోట్ల నిధులు  కేటాయించినట్టు తెలిపారు.  

మల్లంపల్లిలోని ఉమర్ ఖాన్ కు చెందిన  భూములను గుర్తించి పేదలకు పంపిణీ చేస్తామని, ఎన్నికలకు ముందు కాంగ్రెస్  ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో మిగిలిపోయిన హామీలను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. సన్న వడ్లు పండించిన రైతులకు రూ.500ల బోనస్ అందిస్తుందని, పండించిన ప్రతీ గింజను కొనడమే కాకుండా రైతు భరోసా అమలు చేస్తామని సీతక్క అన్నారు. అంతకుముందు జాతీయ రహదారి డివైడర్లో ఎవెన్యు ప్లాంటేషన్ మొక్కలను మంత్రి సీతక్క నాటారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఎస్​ఈ అజయ్ కుమార్, డీపీవో దేవరాజ్, జిల్లా సంక్షేమ అధికారి శిరీష, ఎంపీడీవో రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

జ్ఞానాన్ని ప్రసాదించే దేవాలయాలు గ్రంథాలయాలు : మంత్రి సీతక్క 

ములుగు జిల్లా కేంద్రంలోని లైబ్రరీని త్వరలోనే మోడల్ లైబ్రరీగా తీర్చిదిద్దుతామని, గ్రంథాలయాలు జ్ఞానాన్ని ప్రసాదించే దేవాలయాలని రాష్ర్ట మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మంగళవారం గ్రంథాలయ సంస్థ చైర్మన్​ బానోతు రవిచందర్​ అధ్యక్షతన జరిగిన 57వ జాతీయ గ్రంథాలయ ఉత్సవాల ముగింపు సమావేశానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రంథాలయాల్లో చదువుకొని ఉపాధ్యాయ కొలువులకు ఎంపికైన తొమ్మిది మందిని బానోత్ రవిచందర్, కలెక్టర్​ దివాకర టీఎస్​తో కలిసి సన్మానించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇందిరా గాంధీ పుట్టినరోజును పురస్కరించుకొని గ్రంధాలయ ఉత్సవాలలో పాల్గొనడం సంతోషకరంగా ఉందని, బ్యాంకులను జాతీయం చేసిన ఘనత ఇందిరా గాంధీకే దక్కుతుందని కొనియాడారు . నూతన ప్రభుత్వం ఏర్పాటు కాగానే కేవలం 10నెలల కాలంలో 54,000 మందికి ఉద్యోగాలు నియామక పత్రాలు అందించామని తెలిపారు.  కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్, డీడబ్ల్యూ ఓ శిరీష, తదితరులు పాల్గొన్నారు.