- కేటీఆర్, హరీశ్ దొరతనం మళ్లా బయటపడ్డది
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేసి..
- వాళ్లు మాత్రం వేసుకోలేదు
- వాళ్ల నిరసనల్లోనూ సమానత్వం లేదు
- రైతులకు పదిసార్లు బేడీలువేసిన మీరా మాట్లాడేది అంటూ మండిపాటు
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు దొరతనం మరోసారి బయటపడ్డదని మంత్రి సీతక్క కామెంట్ చేశారు. అసెంబ్లీలో నిరసన సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేసి, వాళ్లిద్దరు మాత్రం వేసుకోలేదని చెప్పారు. మంగళవారం అసెంబ్లీలోని తన చాంబర్లో మీడియాతో మంత్రి సీతక్క చిట్ చాట్ చేశారు. ‘‘అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు, చేతులకు బేడీలతో నిరసన వ్యక్తం చేశారు.
కానీ ఆ నిరసనల్లోనూ సమానత్వం కనిపించలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేశారు తప్ప.. కేటీఆర్, హరీశ్‌రావు మాత్రం బేడీలు వేసుకోకుండా వాళ్ల దొరతనం చూపించుకున్నారు” అని సీతక్క మండిపడ్డారు. ‘‘లగచర్ల రైతుకు బేడీలు వేసిన వ్యవహారంపై సీఎం సీరియస్ అయ్యారు. బాధ్యులైన అధికారులపై చర్యలు కూడా తీసుకున్నారు. అదే బీఆర్ఎస్ హయాంలో కనీసం పదిసార్లయినా రైతులకు బేడీలు వేసి ఉంటారు. కానీ, అప్పట్లో బాధ్యులపై కనీస చర్యలు తీసుకోలేదు.
అలాంటి బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మాట్లాడుతున్నారు. అసలు వాళ్లకు దీనిపై నిరసన వ్యక్తం చేసే నైతిక హక్కు, మాట్లాడే అర్హత కూడా లేదు” అని సీతక్క ఫైర్ అయ్యారు. ‘‘బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు.. సభ వెల్‌లోకి వెళ్తే సస్పెండ్ చేసేవారు. ఇప్పుడు వాళ్లు పెట్టిన నిబంధనలను వాళ్లే కాలరాస్తున్నారు” అని అన్నారు.