
- రాష్ట్రం పరువు తీసింది కేసీఆర్ కుటుంబమేనని ఫైర్
- ‘కాంగ్రెస్ మార్క్ కరప్షన్‌కు బడ్జెట్ నిదర్శనం’ అంటూ కవిత చేసిన కామెంట్లకు కౌంటర్
హైదరాబాద్, వెలుగు: కరప్షన్‌కు కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్ అని, ఆ పార్టీ డీఎన్ఏలోనే అవినీతి ఉందని మంత్రి సీతక్క మండిపడ్డారు. ‘ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కాంగ్రెస్ మార్క్ కరప్షన్‌కు, కాంగ్రెస్ మార్క్కన్నింగ్నెస్కు పర్ఫెక్ట్ బ్లాక్ అండ్ వైట్ ఫ్రూఫ్’ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శుక్రవారం శాసనమండలిలో చేసిన కామెంట్లపై ఆమె ఫైర్ అయ్యారు. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘బీఆర్ఎస్‌ది కాళేశ్వరం కరప్షన్, కుటుంబ పాలన తప్ప.. మరేమీ లేదు. మహిళలను అవమానించిందే ఆ పార్టీ.
తెలంగాణను మీరు (బీఆర్ఎస్) సస్యశ్యామలం చేస్తే.. రైతులు ఎందుకు ఇబ్బందులు పడ్డారు. ప్రాజెక్టుల ఎస్టిమేషన్లు పెంచి దోచుకుతిన్నారు. మీరు నోటిఫికేషన్లు ఇస్తే నియామకాలను ఎవరు అడ్డుకున్నారు. మీరు అన్ని చేస్తే ప్రజలు ఎందుకు ఓడిస్తారు. మీరేం బంపర్ మెజారిటీతో అధికారంలోకి రాలేదు. మీకు మొదటిసారి 63 సీట్లు వచ్చాయి. మేం 65 సీట్లతో అధికారంలోకి వచ్చాం.
మీరు పదేండ్లలో ఎన్ని ఇండ్లు ఇచ్చారు? ప్రజలకు ఇండ్లు ఇవ్వలేదు కాబట్టే.. మిమ్మల్ని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు. మేమొచ్చి ఏడాదిన్నర కూడా కావట్లేదు...అప్పుడే అన్ని కావాలన్నట్టుగా అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. రాష్ట్రం పరువు తీసింది మీరే.. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది” అని కవితపై సీతక్క ఫైర్ అయ్యారు.
అబద్ధాల్లో సీఎం రికార్డు: కవిత
కేసీఆర్‌ను నిందించడానికే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని అబద్ధాలు చెబుతున్నారని, అబద్ధాలు చెప్పడంలో సీఎం గిన్నిస్ రికార్డు సృష్టిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. సభలో సీఎం, మంత్రులు అబద్ధాలు చెప్పడం మానకపోతే.. ప్రివిలేజ్ నోటీసులు ఇస్తామని చెప్పారు. ‘‘కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకుంది.
ఎన్ని అబద్ధాలు చెప్పినా, బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్‌కు ఒక్క శాతం ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. బీఆర్ఎస్‌ను ప్రజలు తిరస్కరించలేదు. సీఎం రేవంత్ ప్రజలను కలవడం లేదు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కూర్చొని పాలన చేస్తున్నారు. కాంగ్రెస్ మార్క్ కరప్షన్‌కు, కన్నింగ్‌నెస్‌కు బడ్జెట్ నిదర్శనం. కాంగ్రెస్‌కు విజన్ లేదు” అని కామెంట్ చేశారు.
కుటుంబానికే రుణమాఫీ చేస్తామని చెప్పినం: జూపల్లి
ప్రతి ఒక్కరికీ రుణమాఫీ చేస్తామని చెప్పలేదని, ప్రతి కుటుంబానికి రూ.2లక్షల లోపు రుణాలను మాఫీ చేస్తామనే ఎన్నికల్లో హామీ ఇచ్చామని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ చేశామని తెలిపారు. రుణమాఫీ కాక ఆదిలాబాద్ జిల్లాలో రైతులు చనిపోయారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ చెప్పగా, మంత్రి స్పందించారు. అబద్ధాలు మాట్లాడవద్దని సూచించారు.
జైళ్లలో పెట్టినట్టయినా హాస్టళ్లలో తిండి పెట్టట్లే: తీన్మార్ మల్లన్న
ప్రస్తుతం ఇస్తున్న డైట్ చార్జీలతో హాస్టళ్లలో ఉం టున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్ల ల కడుపు నిండట్లేదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ‘‘జైళ్లలో ఖైదీల తిండికి రోజుకు రూ.85 ఖర్చు చేస్తున్నారు. పోలీసు జాగిలాల తిండి కోసం నెలకు రూ. 15 వేలు ఖర్చు చేస్తున్నారు. హాస్టళ్లలో పిల్లలకు మాత్రం నెలకు రూ.1,540 చెల్లిస్తున్నారు. కనీసం పోలీసు జాగిలాలకు, ఖైదీల తిండికి పెట్టిన ఖర్చు కూడా హాస్టళ్లలో పిల్లల కోసం పెట్టట్లేదు” అని పేర్కొన్నారు. ప్రభుత్వం కాస్మోటిక్, డైట్ చార్జీలను మళ్లీ పెంచాలన్నారు.