
- రూ. 500 అభయ హస్తం పైసలు కూడా వాడుకున్నరు
- మహబూబాబాద్ జిల్లాలో మహిళా శక్తి క్యాంటిన్ ప్రారంభించిన మంత్రి సీతక్క
కొత్తగూడ, వెలుగు : బీఆర్‌ఎస్ ప్రభుత్వం పావలా వడ్డీ పేరుతో మహిళలకు రూ.3,500 కోట్లు ఎగ్గొట్టిందని మంత్రి సీతక్క ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్‌ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అభయహస్తం పేరుతో మహిళల నుంచి వసూలు చేసిన రూ. 500లను సైతం గత ప్రభుత్వం సొంతానికి వాడుకుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు అందిస్తోందని చెప్పారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించడంతో పాటు బస్సులకు వారినే యజమానులను చేశామన్నారు.
వడ్డీ లేని రుణాలతో మహిళలకు బ్యూటీపార్లర్లు, పెట్రోల్ బంక్‌లు, కుట్టుమెషీన్ వంటి వ్యాపారాలు చేస్తున్నారన్నారు. పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి మహిళా సంఘాలు ఎదిగాయన్నారు. నీతి ఆయోగ్‌లో గంగారం మండలం ఫస్ట్ ప్లేస్‌లో, ములుగు జిల్లా కన్నాయిగూడెం సెకండ్ ప్లేస్‌లో నిలవడం గర్వించదగ్గ విషయం అన్నారు. అంతకుముందు గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన హాస్పిటల్‌ను మంత్రి ప్రారంభించారు.