పొరపాట్లను సరిదిద్దుకోండి: మంత్రి సీతక్క

పొరపాట్లను సరిదిద్దుకోండి: మంత్రి సీతక్క
  • జువైనల్ హోమ్ బాలురకు మంత్రి సీతక్క సూచన

ఎల్బీనగర్, వెలుగు: జువెనైల్ కేంద్రాలు పిల్లల్లో పరివర్తన తెచ్చే కేంద్రాలని మంత్రి సీతక్క అన్నారు. చేసిన తప్పును సరిదిద్దుకుని ఇక్కడి నుంచి మంచి లక్షణాలతో బయటకు -వెళ్లాలని జువైనల్ హోమ్ విద్యార్థులకు ఆమె సూచించారు. ఇక్కడ ఇచ్చేది శిక్షగా కాకుండా శిక్షణగా  గుర్తించాలని చెప్పారు. మంగళవారం సైదాబాద్ లోని జువైనల్ హోమ్ ను మంత్రి సీతక్క మహిళా, శిశు సంక్షేమశాఖ సెక్రటరీ వాకాటి కరుణ, డైరెక్టర్ క్రాంతి వెస్లీ, మహిళాభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ శోభారాణి తదితరులు సందర్శించారు.

జువైనల్ హోమ్ లో ఉంటున్న విద్యార్థులతో మాట్లాడి, సమస్యలను అడిగి  తెలుసుకున్నారు. తర్వాత వారితో కలిసి భోజనం చేశారు. విద్యార్థులు మంత్రి ఎదుట ఆర్చరీ విద్యను ప్రదర్శించారు.  అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ..జువైనల్ కేంద్రాల్లో చిన్న పొరపాటు కూడా చేయొద్దని, శిక్షణా కాలాన్ని సద్వినియోగం చేసుకుని తల్లిదండ్రుల వద్దకు చేరుకోవాలన్నారు.  కేంద్రంలో లైబ్రరీ, యోగా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తామని, సాంకేతిక విద్య నేర్పిస్తామని తెలిపారు.హోమ్​లో 72 మంది బాల నేరస్తులున్నారని, వారికి కావాల్సిన వసతులు, సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. టాటా సంస్థ సహకారంతో విద్యార్థులకు సాంకేతిక విద్యనందిస్తామని తెలిపారు. దీంతో పాటు వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇచ్చి, ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామన్నారు. స్కూల్ గేమ్స్ లో పతకాలు సాధించేలా శిక్షణ ఇస్తామన్నారు. అనంతరం -మంత్రి సీతక్క విద్యార్థులకు బహుమతులతో పాటు కొత్త వస్త్రాలను అందజేశారు.  

నాణ్యతలో రాజీవద్దు

హైదరాబాద్,​ వెలుగు: అభివృద్ధి పనుల్లో  ఏఈఈల మార్కు కనిపించాలని, లక్ష్యం నిర్దేశించుకుని ముందుకు పోవాలని మంత్రి సీతక్క అన్నారు. నాణ్యత విషయంలో అస్సలు రాజీపడకూడదన్నారు. ఇటీవల నియామక పత్రాలు అందుకున్న ఏఈఈలకు మంగళవారం హైదరాబాద్  ఎర్రమంజిల్ లోని పంచాయతీ రాజ్  ఇంజినీర్ ఇన్ చీఫ్  కార్యాలయంలో శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. కొత్త ఏఈఈలకు  అభినందనలు తెలిపి వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కొత్త ఏఈఈలు, ఉద్యోగులు మంత్రిని సన్మానించారు. కొత్త ఏఈఈలకు శాఖ డైరీలను మంత్రి అందజేసి మాట్లాడారు. ఏఈఈలు నిబద్ధతతో పనిచేసి మీ కుటుంబానికి, ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలన్నారు.

సీనియర్ల అనుభవాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. బిహార్ లో చాలా బ్రిడ్జిలు కూలిపోతున్నాయని,  అక్కడ అనేక మంది చనిపోయారని, ఆ దుర్ఘటనలను గుణపాఠంగా తీసుకొని నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీపడకూడదని పేర్కొన్నారు. వందేండ్లు నిలిచే బిల్డింగులు మన పనితనానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తాయన్నారు. తాను ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చి మంత్రి స్థాయికి ఎదిగానని సీతక్క పేర్కొన్నారు. తల్లిదండ్రుల నుంచి కష్టపడడం నేర్చుకున్నానని చెప్పారు. నిజాయితీ, నిబద్ధతతో పనిచేస్తే అద్భుతమైన ఇంజినీర్లుగా రాణిస్తారన్నారు.  రూ.1,377 కోట్లతో గ్రామీణ రహదారులను నిర్మిస్తున్నామని,  ఈ పనులు మీ హయాంలో ప్రారంభం కావడం మీ అదృష్టమన్నారు.