- మహిళా మంత్రి, మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ను నిందిస్తున్నడు
హైదరాబాద్, వెలుగు: అధికారంలో ఉన్నప్పుడు మహిళల భద్రతను గాలికొదిలేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు గాలి మా టలు చెప్పడం మానుకోవాలని మంత్రి సీతక్క హితవు పలికారు. మీ హయాంలో మహిళా భద్రత అంత గొప్పగా ఉంటే.. గత పదేండ్లలో మహిళలపై లక్షన్నరకు పైగా నేరాలెందుకు జరి గాయని ప్రశ్నించారు.
మహిళలపై అఘాయిత్యా లు జరుగుతుంటే మంత్రి సీతక్క పట్టించుకోవ డం లేదన్న కేటీఆర్ వ్యాఖ్యలపై సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె మండిపడ్డారు. “రాఖీ పండుగ రోజు కూడా మహిళా మంత్రిని, మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ను నిందించడం కేటీఆర్ కే చెల్లింది. పండగపూట రాజకీయ లబ్ధి కోసం ఆయన అబద్ధాలు చెప్తున్నరు. మహిళా భద్రతకు మా ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది.
నేరాలకు కారణం అవుతున్న డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల కట్టడి కోసం తాము చేపడుతున్న చర్యలు కేటీఆర్ కు కనిపించడం లేదు. మహిళలపై ఎక్కడ ఏ అఘాయిత్యం జరిగినా సత్వరమే మా ప్రభుత్వం స్పందిస్తుంది. గంటల వ్యవధిలోని నిందితులను అరెస్టు చేస్తున్నం. లైంగిక దాడుల కేసుల్లో ఇప్పటికే 24 మంది దోషులకు శిక్షలు పడేలా చేశాం. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా నేనే ఎన్నో సందర్భాల్లో బాధితులను పరామర్శించాను” అని మంత్రి సీతక్క తెలిపారు.
మహిళల్ని గౌరవించడం నేర్చుకో
బీఆర్ఎస్ హాయంలో మహిళలపై లక్షన్నరకు పైగా నేరాలు జరిగితే, ఎన్ని కేసుల్లో కేటీఆర్ బాధితులను పరమార్శించారని సీతక్క ప్రశ్నించారు. మహిళలపై దాడులు జరిగితే బయటికి రాకుండా తొక్కి పట్టిన చరిత్ర బీఆర్ఎస్ దని, విచ్చలవిడిగా పబ్బులు, గంజాయి, డ్రగ్స్ వ్యాపారం జరిగినా నియంత్రించని అసమర్థ పాలన మీదని ఫైర్ అయ్యారు.
మహిళలను బ్రేక్ డాన్సర్లు, రికార్డింగ్ డాన్సర్లుతో పోల్చడం కేటీఆర్ చెప్పినట్లు చిన్న విషయం కానే కాదని...కోట్ల మంది శ్రామిక, సామాన్య మహిళలని కించ పరచడమే అవుతుందన్నారు. మహిళా భద్రతకు కాంగ్రెస్ ఏం చేసిందో కాంగ్రెస్ ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డిని కేటీఆర్ అడిగి తెలుసుకోవాలన్నారు.