- తప్పు చేయకపోతే విచారణ ఎదుర్కోవాలి
హైదరాబాద్, వెలుగు: మొన్నటిదాకా జైలుకెళ్తా.. యోగా చేస్తా.. స్లిమ్ అయి వస్తా అని కామెంట్లు చేసిన కేటీఆర్.. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారని మంత్రి సీతక్క నిలదీశారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేబినెట్ ఆమోదం తీసుకోకుండా విదేశీ సంస్థకు కేటీఆర్ డబ్బులు చెల్లించారని ఆరోపించారు.
ప్రభుత్వ అనుమతి లేని అంశానికి సభలో చర్చ పెట్టాలనడం వింతగా ఉందన్నారు. అసెంబ్లీ ఆవరణలో సీతక్క మీడియాతో చిట్‌చాట్ చేశారు. ‘‘గతంలో ప్రభుత్వ కేసులు ఎదుర్కొన్న నాయకులు కోర్టుకు వెళ్తే కేటీఆర్ తప్పుబట్టిండు. ఇప్పుడు కోర్టు మెట్లు ఎందుకు ఎక్కినట్లు? కేటీఆర్‌కు నిజాయితీ లేదు. లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే భూ భారతి బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుకునే కుట్ర చేస్తున్నడు. భూ కబ్జాల బాగోతం ఎక్కడ బయటపడుతుందో అని బీఆర్ఎస్ లీడర్లకు భయం పట్టుకున్నది.
చట్టం ముందు అందరూ సమానమే. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో విచారణ ఎదుర్కోవాల్సిందే. గవర్నర్ క్లియరెన్స్ ఇచ్చిన కేసుపై సభలో చర్చ అవసరం లేదు. బీఏసీలో ఈ ఫార్ములా కేసుపై చర్చ కోసం బీఆర్ఎస్ ఎందుకు అడగలేదు? పార్లమెంట్లో అంబేద్కర్‌ను.. అసెంబ్లీలో దళిత స్పీకర్‌ను అవమానించారు’’అని సీతక్క ఫైర్ అయ్యారు.