అంగన్​వాడీలకు నిరంతరం పాలు అందాలి: సీతక్క

అంగన్​వాడీలకు నిరంతరం పాలు అందాలి: సీతక్క
  • సరఫరాను మెరుగుపరచాలి

హైదరాబాద్, వెలుగు : అంగ‌‌న్ వాడీ కేంద్రాలకు నిరంతరం పాలు అందాలని, స‌‌ర‌‌ఫ‌‌రాలో ఎలాంటి గ్యాప్ లేకుండా చ‌‌ర్యలు తీసుకోవాల‌‌ని అధికారులను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. మారుమూల పల్లెల్లోని కేంద్రాల‌‌కు సైతం స‌‌కాలంలో పాల స‌‌ర‌‌ఫ‌‌రా జ‌‌ర‌‌గాలన్నారు. ఆరోగ్య ల‌‌క్ష్మీ ప‌‌థ‌‌కం పై శ‌‌నివారం సెక్రటేరియెట్ లో మంత్రి సీత‌‌క్క రివ్యూ చేశారు. గ‌‌ర్భిణులు, బాలింత‌‌ల‌‌కు పోష‌‌కాహారం అందించే ల‌‌క్ష్యంతో ప్రభుత్వం ఆరోగ్య ల‌‌క్ష్మీ ప‌‌థ‌‌కాన్ని అమలు చేస్తున్నదని ఆమె చెప్పారు. ఇందులో భాగంగా ప్రతిరోజు 200 ఎంఎల్ పాల‌‌ను గ‌‌ర్భిణులు, బాలింత‌‌ల‌‌కు అంగ‌‌న్ వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్నదని తెలిపారు. ‘‘అంగ‌‌న్ వాడీ కేంద్రాల‌‌కు టెట్రా ప్యాకెట్లను  విజ‌‌య డెయిరీ స‌‌ప్లై చేస్తున్నది.

గ‌‌త డిసెంబ‌‌ర్ నుంచి ఇప్పటి వ‌‌ర‌‌కు 1.67 కోట్ల లీట‌‌ర్ల స‌‌ర‌‌ఫ‌‌రా కోసం ఆర్డర్ చేశాం. కానీ 1.56 కోట్ల లీట‌‌ర్ల పాల‌‌ను మాత్రమే విజ‌‌య డెయిరీ స‌‌ర‌‌ఫ‌‌రా చేయ‌‌గలిగింది. వంద శాతం ఎందుకు సప్లై చేయడం లేదు” అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆర్డర్ మేరకు ఎందుకు సప్లై చేయలేకపోతున్నారు? ఇతర సంస్థలకు ఆర్డర్స్ ఇవ్వాలా? అని విజ‌‌య డెయిరీ ప్రతినిధుల‌‌ను ప్రశ్నించారు.

మ‌‌రో మూడు నెల‌‌లు అవ‌‌కాశం ఇస్తామ‌‌ని, పాల స‌‌ర‌‌ఫ‌‌రా సంతృప్తిక‌‌రంగా లేక‌‌పోతే క‌‌ఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వ‌‌స్తుందని హెచ్చరించారు. కాగా, అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే పాలను మంత్రి సీత‌‌క్క తాగి నాణ్యతను ప‌‌రిశీలించారు. పాల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం లీట‌‌ర్ టెట్రా ప్యాక్ ను రూ.57 అందిస్తున్న విజ‌‌య డెయిరీ.. ధర పెంచాలని కోరింది. అయితే మంత్రి అందుకు తిర‌‌స్కరించారు. మూడు నెల‌‌ల త‌‌ర్వాత మ‌‌రోసారి స‌‌మీక్షించి ధ‌‌ర‌‌ల పెంపుపై నిర్ణయం తీసుకుంటామ‌‌న్నారు.  

ట్రాన్స్ జెండర్ల కోసం మైత్రి క్లినిక్ లు.. 

ట్రాన్స్ జెండర్లకు ఔట్ పేషెంట్, డయాగ్నోస్టిక్ సేవలు అందించేందుకు ఈ నెల 2న 33 జిల్లా కేంద్రాల్లో మైత్రి ట్రాన్స్ క్లినిక్ లను ప్రభుత్వం ప్రారంభించనుంది. వీటిని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క వర్చువల్ గా ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. జిల్లా ఆస్పత్రుల్లో ట్రాన్స్ క్లినిక్ ల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నారు.