- ఆ మట్టి బిడ్డల ప్రతిరూపమే తెలంగాణ తల్లి విగ్రహం : మంత్రి సీతక్క
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ఆత్మగౌరవాన్ని గుండెల్లో పెట్టుకుని తల్లి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారని మంత్రి సీతక్క అన్నారు. ఆమె జన్మదినం రోజే ఈ ప్రకటన రావడం సంతోషకరమన్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై బీజేపీ, బీఆర్ఎస్లు సొంత రాజకీయ ఎజెండాతో వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రజల అస్తిత్వం ఆత్మగౌరవం, పోరాటం, శ్రమైక జీవన రూపం, తల్లి ఆశీర్వాదం అన్ని కలగలిపిన నిండైన రూపం తెలంగాణ తల్లి రూపమని ఆమె చెప్పారు.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే తమ తల్లుల్ని తాము చూసుకున్నట్టుగా ఉందన్నారు. తెలంగాణ ఆడబిడ్డలు ఎట్టి బిడ్డలు కాదని.. మట్టి బిడ్డలు, గట్టి బిడ్డలు అని చెప్పారు. ఆ మట్టిబిడ్డల ప్రతిరూపంలా తెలంగాణ తల్లి విగ్రహం ఉందన్నారు. అలాంటి తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ తల్లి విగ్రహంపై తీర్మానం సందర్భంగా ఆమె మాట్లాడారు. పదేండ్ల కాలంలో తెలంగాణ తల్లికి ఇప్పటిదాకా అధికారిక రూపమే లేదని అన్నారు.
కేవలం బీఆర్ఎస్ పార్టీ రూపం, జెండా రంగు, కేటీఆర్ చెల్లికి విగ్రహ రూపం ఇచ్చి తెలంగాణ తల్లి విగ్రహమని ప్రచారం చేశారన్నారు. అదే తెలంగాణ తల్లి విగ్రహమని ప్రజలపై రుద్దారన్నారు. సీతక్క మాట్లాడుతుండగా బీజేపీ ఎమ్మెల్యేలు రన్నింగ్ కామెంట్రీ చేయడంతో వారికి దీటుగా బదులిచ్చారు. అసలు ఉద్యమంలో మీరెక్కడున్నారని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదని ఆమె పేర్కొన్నారు. మహిళలను గౌరవించే పార్టీ అంటే కాంగ్రెస్ అని పేర్కొన్నారు.