- దివ్యాంగులకు ప్రత్యేక జాబ్ పోర్టల్ ఆవిష్కరణలో మంత్రి సీతక్క
- ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటే అర్హత ప్రకారం కొలువులు
- త్వరలో బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్ ఉద్యోగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ పరిమితిని 4 శాతానికి పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి తెలిపారు. సోమవారం సెక్రటేరియెట్‌లో దివ్యాంగులకు జాబ్ పోర్టల్‌ను ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, డైరెక్టర్ శైలజలతో కలిసి మంత్రి సీతక్క ఆవిష్కరించారు. అనంతరం మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్‌లో 10 మంది దివ్యాంగులకు మంత్రి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేసి మాట్లాడారు. ఉద్యోగాల కోసం కంపెనీల చుట్టూ తిరగకుండా ఈ పోర్టల్ లో దివ్యాంగులు రిజిస్టర్ చేసుకోవాలని, వారి అర్హతలను బట్టి ఉద్యోగాలు అందుతాయని సూచించారు.
దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వెల్ఫేర్ బడ్జెట్లో 5 శాతం నిధులను దివ్యాంగులకు కేటాయిస్తున్నామని, దివ్యాంగులకు ఇచ్చే పరికరాల కోసం బడ్జెట్లో రూ.50 కోట్లు కేటాయించామని మంత్రి గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుతో పాటు ఇతర స్కీముల్లోనూ దివ్యాంగులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. దివ్యాంగుల సమస్యలను తన దృష్టికి తీసుకరావాలని, వెంటనే పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని, ఆందోళన చెందవద్దని మంత్రి సూచించారు. దివ్యాంగులకు ఉద్యోగాలు కల్పించేందుకు పోర్టల్ ఓపెన్ చేయడం మంచి పరిణామమని కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య తెలిపారు. దివ్యాంగుల వివరాలు తీసుకొని, వారి అర్హతలనుబట్టి ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. జాబ్ పోర్టల్‌పై కార్పొరేషన్ తరఫున అవగాహన కార్యక్రమాలు చేపడుతామన్నారు.