- మహిళల భద్రతకు కట్టుబడి ఉన్నం
- షీ టీమ్స్, టీ సేఫ్ సక్సెస్ అయ్యాయి
- డ్రగ్స్ కారణంగానే నేరాలు జరుగుతున్నాయని మంత్రి కామెంట్
హైదరాబాద్, వెలుగు: మహిళలు, చిన్నారుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క అన్నారు. ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రక్షణ విషయంలో పోలీసులు కూడా అందరికీ భరోసా కల్పించాలని సూచించారు. హైటెక్ సిటీలోని హెచ్‌ఐసీసీలో విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో “ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ హ్యూమన్ ట్రాఫికింగ్”అనే అంశంపై గురువారం జాతీయ స్థాయి టెక్నికల్ కన్సల్టేషన్ సదస్సు జరిగింది. ఇందులో మంత్రి సీతక్క పాల్గొని మాట్లాడారు. ‘‘మహిళను చూడగానే క్రూరమైన ఆలోచనలు రావడం దురదృష్టకరం.
నేరాలకు పాల్పడిన వారికి వెంటనే శిక్ష పడేలా విధివిధానాలు రూపొందిస్తున్నం. హైడ్రా దూకుడుపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. అలాగే.. మహిళల భద్రతపై రాష్ట్ర సర్కార్ చేపడ్తున్న చర్యలపై కూడా చర్చ జరగాలి. డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు అత్యాచారాలు, హత్యలకు కారణం అవుతున్నాయి. హ్యూమన్ ట్రాఫికింగ్ చాలా ప్రమాదకరం. పేదరికం, ఆర్థిక పరిస్థితులు, వలసల కారణంగానే మానవ అక్రమ రవాణా పెరిగిపోతున్నది’’అని సీతక్క అన్నారు. చిన్నారులను కిడ్నాప్ చేసి అమ్మేస్తున్నారని తెలిపారు.
పని ప్రదేశాల్లో భద్రత కల్పించాలి
పని ప్రదేశాల్లో మహిళలకు భద్రత కల్పించాలని అధికారులకు మంత్రి సీతక్క సూచించారు. షీ టీమ్స్, టీ సేఫ్ యాప్ మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు. మహిళల పట్ల యువత చెడు ఆలోచనలు మానుకోవాలని హెచ్చరించారు. హ్యూమన్ ట్రాఫికింగ్‌ను కంట్రోల్ చేయడంలో మంచి ఫలితాలు సాధిస్తున్నామని డీజీపీ జితేందర్ అన్నారు. దీన్ని పూర్తిగా అరికట్టేందుకు అందరూ సహకరించాలని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా హ్యూమన్ ట్రాఫికింగ్ వేగంగా విస్తరిస్తున్నదని విమెన్ సేఫ్టీ వింగ్ చీఫ్ శిఖా గోయల్ అన్నారు. రాష్ట్రంలో దీన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పదేండ్లలో 62వేల మంది చిన్నారులను రక్షించామన్నారు.