
- ఇపుడున్న సంఖ్య కన్నా 30 శాతం పెరగాలి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య పెరగాలని, అందుకు టీచర్లు, ఆయాలు కృషి చేయాలని మంత్రి సీతక్క సూచించారు. గ్రామాల్లో ఆరేండ్ల లోపు వయసు పిల్లలను గుర్తించి అంగన్‌వాడీ కేంద్రాలకు పంపించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ఇపుడున్న పిల్లల కంటే 30 శాతం సంఖ్య పెంచాలని మంత్రి ఆదేశించారు. సోమవారం ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ కార్యాలయంలో మహిళా స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ 2025=26 యాక్షన్ ప్లాన్‌పై మంత్రి రివ్యూ చేశారు.
బడ్జెట్‌లో కేటాయించిన నిధులకు అనుగుణంగా ప్లాన్స్ ఖరారు చేసి నిధులను ఖర్చు చేయాలని సూచించారు. అంగన్‌వాడీ పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించాలన్నారు. పిల్లలకు ఇచ్చే ఫుడ్‌లో క్వాలిటీ మరింత పెంచేందుకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్), యునిసెఫ్ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశామని, రిపోర్ట్ రాగానే చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క తెలిపారు. పిల్లల దత్తత ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
టీనేజీ అమ్మాయిలకు చిరుధాన్యాల స్నాక్స్
రాజీవ్ యువ వికాస పథకంలో దివ్యాంగులకు ఐదు శాతం కేటాయిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క సూచించారు. కుటుంబంలో దివ్యాంగులుంటే, వారి పేరు మీదే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. 14 నుంచి 18 ఏండ్లలోపు బాలికలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పల్లిపట్టీలు, చిరుధాన్యాల పట్టీలు అందిస్తామని, పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ స్కీంను అమలు చేస్తామని మంత్రి తెలిపారు.
రివ్యూలో మహిళా, స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రాంచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ, టీజీ పుడ్స్ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు శోభారాణి, ముత్తినేని వీరయ్య, ఫహీమ్, బాలల హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ సీతాదయాకర్ రెడ్డి, మెంబర్లు పాల్గొన్నారు.