మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం.. మంత్రి సీతక్క

మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం.. మంత్రి సీతక్క
  • మహిళా సంఘాల వ్యాపారాలకు వడ్డీ లేని రుణాలు
  • నెక్లెస్​ రోడ్​ పీపుల్స్ ప్లాజాలో సరస్ ఫెయిర్‌‌‌‌‌‌‌‌ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: మహిళల కన్నీళ్లు, కష్టాలు తుడిచి వారిని కోటేశ్వరులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌‌‌‌​ నెక్లెస్ రోడ్‌‌‌‌లోని పీపుల్స్ ప్లాజాలో సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సరస్ ఫెయిర్‌‌‌‌‌‌‌‌ను మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంప్రదాయ వాయిద్యాలు, నృత్యాలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామీణ స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన చేనేత, హస్తకళలు, ఆహార ఉత్పత్తుల స్టాళ్లను సందర్శించి, పలు వస్తువులను మంత్రి కొనుగోలు చేశారు.

చేర్యాల బొమ్మ మాస్కులు, తమిళనాడు స్టాల్‌‌‌‌లో చీరలు, ఆదిలాబాద్ స్టాల్‌‌‌‌లో ఇప్ప లడ్డూలు, కేరళ సంప్రదాయ ఆహార పదార్థాలు, జార్ఖండ్ ట్రెడిషనల్ వస్త్రాలు, పెద్దపల్లి వెదురు వస్తువులు, జగిత్యాల లెదర్ పర్సు ఇలా పలు స్టాళ్లలో వస్తువులను ఆమె కొన్నారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ.. మహిళా సంఘాల ఉత్పత్తులతో ప్రతి ఇల్లు కళకళలాడాలన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాల ఉత్పత్తులను ఒకచోట ప్రదర్శించడం అభినందనీయమని, సరస్ ఫెయిర్‌‌‌‌‌‌‌‌ను సక్సెస్‌‌‌‌ చేయాలని కోరారు. ఉక్కు మహిళా ఇందిరా గాంధీ స్ఫూర్తితో మహిళలను ఆర్థికంగా బలపతం చేసే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని చెప్పారు. 

అంబేద్కర్‌‌‌‌‌‌‌‌ ఆశయాలను ఆచరిస్తున్నం.. 

మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని అంబేద్కర్ చెప్పారని సీతక్క గుర్తుచేశారు. అంబేద్కర్ ఆశయాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరించి చూపిస్తుందన్నారు. స్వయం సహాయక సంఘాలకు రూ.లక్ష కోట్ల రుణాలిచ్చే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని, మహిళా సంఘాల వ్యాపారాలకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నామని వెల్లడించారు.

అతివలు స్వశక్తితో ముందుకు సాగేలా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు శిల్పారామంలో మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. సెర్ప్ ఆధ్వర్యంలో ప్రారంభమైన సరస్ ఫెయిర్ అక్టోబర్ 7 వరకు కొనసాగనున్నది.