- శానిటేషన్పై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి: మంత్రి సీతక్క
- గతంలో మాదిరిగా సీజనల్ వ్యాధులు లేవు
- తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవు
- రుణమాఫీ పూర్తయ్యాక జీపీలకు నిధులిస్తమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ప్రతి మూడు నెలలకు ఒక సారి మూడు రోజుల పాటు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నిర్వహిస్తామని పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క తెలిపారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై మరింత శ్రద్ధ పెట్టాలని అధికారులను ఆమె ఆదేశించారు.
ఇటీవల నాలుగు రోజుల పాటు స్వచ్ఛదనం -పచ్చదనం స్పెషల్ డ్రైవ్ లో అనుకున్న ఫలితాలు సాధించినప్పటికీ.. శానిటేషన్ మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉందన్నారు.
పారిశుధ్యం సరిగా ఉంటేనే ప్రజల ఆరోగ్యం బాగుంటుందని, సీజనల్ వ్యాధులు రావని ఆమె స్పష్టం చేశారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం, స్వయం సహాయక సంఘాల బలోపేతం తదితర అంశాలపై జిల్లా పంచాయతీ అధికారులు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సెక్రటేరియెట్ నుంచి మంత్రి సీతక్క మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పీఆర్ సెక్రటరీ లోకేశ్ కుమార్, సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్, కమిషనర్ అనితా రామచంద్రన్ తో కలసి ఆయా అంశాల్లో సాధించిన పురోగతిని జిల్లాల వారీగా సమీక్షించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. స్వచ్ఛదనం -పచ్చదనం సక్సెస్ కోసం జిల్లా స్థాయి అధికారుల నుంచి పారిశుధ్య కార్మికుల వరకు అందరూ కష్టపడ్డారని అభినందించారు. మంచి పనితీరు కనబరిచిన సిబ్బందిని స్వాతంత్ర్య దినోత్సవం రోజు సన్మానించాలని జిల్లా అధికారులను మంత్రి ఆదేశించారు.
మహిళల భద్రత కోసం కమిటీ
మహిళల భద్రత కోసం త్వరలోనే ఎక్స్‌పర్ట్ కమిటీని ఏర్పాటు చేస్తామని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. ఈ మేరకు మహిళల భద్రత కోసం చేపట్టాల్సిన చర్యలపై మంగళవారం అధికారులతో ఆమె రివ్యూ చేశారు. సెక్రటేరియట్‌లో జరిగిన ఈ సమావేశంలో మహిళ, శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ వాకాటి కరుణ, సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్, మహిళా భద్రతా విభాగం డీజీ శిఖా గోయల్, డీఐజీ రెమా రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఇంట్లోని మనుషుల నుంచే మహిళలకు వేధింపులు పెరగడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత మహిళలు బహిరంగంగా మాట్లాడేలా ధైర్యం కల్పిస్తామన్నారు. సమాజంలో ఆలోచన మారే విధంగా ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. విద్యా సంస్థల్లో అవేర్‌నెస్ క్యాంపెయిన్ చేపడుతామని పేర్కొన్నారు. మహిళా మంత్రులు, ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని వివరించారు. మహిళల భద్రత కోసం స్వయం సహాయక సంఘాల సహాయాన్ని తీసుకుంటామని వెల్లడించారు.
మహిళా సంఘాల్లో 63 లక్షల మంది సభ్యులున్నారని.. మహిళా సంఘాల సభ్యులతో గ్రామ స్థాయి నుంచి సోషల్ యాక్షన్ కమిటీలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. మహిళలను గౌరవించడం, నేరాలు జరిగినప్పుడు పడే శిక్షలపై చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలని..ఇందు కోసం పాఠ్యాంశాల్లోనూ వీటిని చేర్చాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
స్పెషల్ ఆఫీసర్లు అందుబాటులో ఉండాలి
గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్లు ప్రతిరోజు కనీసం 3 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి సూచించారు. ప్రతి రోజు సిబ్బంది హాజరు, చేసిన పనుల వివరాలను పై అధికారులకు నివేదించాలని చెప్పారు. అప్పుడే సిబ్బంది బాధ్యతతో పనిచేస్తారని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులకు పారిశుధ్యం, దోమల నివారణపై అవగాహన పెంచితే అనుకున్న ఫలితాలు సాధిస్తామన్నారు. జబ్బులు, వాటికి గల మూలాలను ప్రజలకు తెలియచేస్తే సగం రోగాలు మాయమవుతాయన్నారు.
మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వ స్కూల్స్టూడెంట్లకు మరో జత యూనిఫాం లు పంపిణీ చేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా అధికారులను ఆమె ఆదేశించారు. మహిళా సంఘాల ఆర్థిక బలోపేతం కోసం ప్రభుత్వం చేపట్టిన మహిళా శక్తి ప్రోగ్రాంలో ఎస్సీ, ఎస్టీ మహిళల భాగస్వామ్యం పెరిగేలా చూడాలన్నారు. ఆవాస గ్రామాల్లో పర్యటించి మహిళలకు అవగాహన కల్పించాలన్నారు.
పారిశుధ్యాన్ని మరింత మెరుగు పరచాలి
స్వచ్ఛదనం -పచ్చదనం డ్రైవ్ ద్వారా గ్రామాల్లో పరిశుభ్రత పెరిగిందని.. దాన్ని మరింత మెరుగు పరచాలని అధికారులకు మంత్రి సూచించారు. మండలాల వారీగా నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ.. పారిశు ధ్య పనులను వేగవంతం చేయాలన్నారు. ఆయా జిల్లాల్లో పారిశుధ్య లోపాలపై వార్త లు రావడం పట్ల మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్పెషల్ డ్రైవ్ చేపట్టిన తర్వాత కూడా ఇలా ఎందుకు జరుగుతోం దని అధికారులను మంత్రి ప్రశ్నించారు. పారి శుధ్య నిర్వహణలో లోటు పాట్లుంటే సరిదిద్దుకోవాలని.. అదే సమయంలో తప్పుడు వార్తలు వస్తే చర్యలు తప్పవని, వాస్తవాలను ప్రజలకు తెలపాలని మంత్రి ఆదేశించారు. గత ప్రభుత్వంలో విష జ్వరాలతో ఊర్లకు ఊర్లు మంచాన పడ్డాయని.. ఇప్పుడు అటువంటి పరిస్ధితులు లేవని ఆమె గుర్తుచేశారు.