- వాళ్ల జీవితాల్లో మార్పు తేవడమే నా లక్ష్యం
- సెర్ప్తో బ్రాక్ ఇంటర్నేషనల్ ఎంవోయూ
హైదరాబాద్, వెలుగు: పేదల జీవితాల్లో మార్పు తేవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. పేదరికం నుంచి వచ్చిన తనకు పేదలతో పేగు బంధం ఉందన్నారు. పేదరికాన్ని రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. పేదరిక నిర్మూలన కోసం తమ ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో పాలుపంచుకోవాలని స్వచ్చంద సంస్థలకు ఆమెపిలుపునిచ్చారు.
మంగళవారం సెక్రటేరియెట్లో మంత్రి సీతక్క సమక్షంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్), పలు దేశాల్లో పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్న బ్రాక్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ఎంవోయూ కుదుర్చుకున్నాయి. ఈ ఎంవోయూలో భాగంగా తెలంగాణలోని కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట్, వికారాబాద్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా 4 వేల అత్యంత పేద కుటుంబాలను గుర్తించి, పేదరికం నుంచి వారిని బయటకి తెచ్చేందుకు బ్రాక్ పనిచేయనుంది. మూడేండ్లపాటు ఆయా కుటుంబాలకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం మొదలు మెరుగైన జీవనోపాధి కల్పించే దాకా బ్రాక్ సాయం చేయనుంది. అందుకు సంబంధించిన విధివిధానాలపై చర్చ జరగ్గా మంత్రి సీతక్క పలు సూచనలు చేశారు.
ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు రండి..
పేదరిక నిర్మూలన విధివిధానాలు నగరాల్లో రచిస్తే సరిపోదని, క్షేత్రస్థాయిలో ప్రజలకేం కావాలనేదానిపై కార్యాచరణ సిద్ధం చేయాలని సీతక్క సూచించారు. ఆర్థిక రంగంలో దేశం దూసుకుపోతున్నా, నిరుపేదలకు, అట్టడుగు ప్రజలకు కనీస అవసరాలు అందట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేదరికాన్ని అంతమొందించేందుకు తమ ప్రభుత్వంలో కలిసి పని చేయాలని స్వచ్చంద సంస్థలకు మంత్రి పిలుపునిచ్చారు.
ప్రభుత్వం, ప్రజా సంఘాలు, సేవా సంస్థలు అంకితభావంతో పనిచేస్తే పేదరికం ఉండదన్నారు. పేదలకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, సుస్థిరమైన జీవనోపాధి కల్పించేందుకు తమ ప్రభుత్వానికి చేయూతనివ్వాలని మంత్రి కోరారు. అనంతరం బ్రాక్, ఇతర సంస్థల ప్రముఖులను మంత్రి అభినందించి సత్కరించారు. పంచాయతీ రాజ్ సెక్రటరీ లోకేశ్ కుమార్, సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్, జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, డీఆర్డీవోలు, బ్రాక్ ఇంటర్నేషల్ సంస్థ ఇండియన్ హెడ్ శ్వేతా బెనర్జీ, ఆగాఖాన్ ఫౌండేషన్ సీఈవో టిన్ని స్వహ్ని, ప్రధాన్, క్రిస్ప్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.