- ములుగు కలెక్టరేట్‌లో జరిగిన రివ్యూలో సీతక్క
- గిరిజన సంక్షేమ హాస్టల్‌లో స్టూడెంట్లతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేసిన మంత్రి
ములుగు, వెలుగు : వచ్చే ఏడాది జరగనున్న మేడారం మినీ జాతర కోసం చేస్తున్న పనులు మహాజాతరకు సైతం పనికొచ్చేలా ఉండాలని మంత్రి సీతక్క చెప్పారు. మినీ మేడారం జాతర పనులతో పాటు పలు అంశాలపై కలెక్టర్ దివాకర్, ఎస్పీ శబరీష్, డీఎఫ్‌వో రాహుల్ కిషన్ జాదవ్‌తో కలిసి బుధవారం ములుగు కలెక్టరేట్‌లో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఫిబ్రవరిలో జరిగే మినీ మేడారం జాతరను సక్సెస్ చేసేందుకు ఆఫీసర్లు కోఆర్డినేషన్‌తో పని చేయాలని సూచించారు.
వందల కోట్లతో చేపడుతున్న పనులు శాశ్వతంగా ఉండకపోవడం వల్ల తిరిగి అవే పనులు చేయాల్సి వస్తోందన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన స్పర్శ్ స్కీమ్‌లో జాతరకు నిధులు వచ్చే అవకాశం ఉందని, ఈ నిధులతో గద్దెల చుట్టూ ఫ్లోరింగ్ చేయడంతో పాటు మంచి నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సెలవు రోజుల్లో సైతం భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నందున సరైన వసతులు కల్పించాలని సూచించారు.
జాతరకు అదనపు నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు. 2024లో మహాజాతర సందర్భంగా చేసిన పనుల బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు శుద్ధి చేసిన మంచినీటిని అందించాలని, గ్రామీణ అధికారులు నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ నీటి సరఫరాపై దృష్టి పెట్టాలని చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
నేనూ హాస్టల్లోనే ఉండి చదువుకున్నా...
ములుగులోని గడిగడ్డలో ఉన్న గిరిజన సంక్షేమ హాస్టల్‌ను మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా స్టూడెంట్లతో కలిసి నేలపై కూర్చొని బ్రేక్‌ఫాస్ట్ చేశారు. తాను కూడా ఐటీడీఏ పరిధిలోని ములుగు ఎస్టీ హాస్టల్‌లో ఉండి స్థానిక గర్ల్స్ హైస్కూల్‌లో చదువుకున్నానని చెప్పారు. స్టూడెంట్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని ఉన్నతంగా ఎదగాలని సూచించారు.
స్టూడెంట్లకుఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్లు సీహెచ్.మహేందర్, సంపత్‌రావు, ఓఎస్డీ మహేశ్ బి గీతే, డీఎస్పీ రవీందర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ మాణిక్యం, డీఈ సునీత, ఎండోమెంట్ ఈవో రాజేందర్, డీఎంహెచ్‌వో అప్పయ్య, ఆఫీసర్లు దేశీరాంనాయక్, బానోత్ లక్ష్మణ్, కొమురయ్య, శిరీష, దేవ్‌రాజ్ పాల్గొన్నారు.