
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం వాడీవేడిగా నడుస్తోంది. గురుకులాలలో సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, బకాయిలు చెల్లించకపోవడంతో సమస్యలు పెరిగాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్ అన్నారు. అదే విధంగా గురుకులాలలో 83 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారని, గురుకులాలకు బకాయిలు ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మాజీ మంత్రి గంగుల కమలాకర్.. అంబేద్కర్ ఓవర్సీస్ అర్హులను ఎంపిక ఎందుకు చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రతిపక్షాల విమర్శలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వంలో పేద పిల్లలకు మెరుగైన విద్య అందిస్తు్న్నామని తెలిపారు. చిన్న చిన్న అంశాలను బీఆర్ఎస్ రాద్దాంతం చేస్తోందని అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలపై రాజకీయం చేయడం తగదని అన్నారు. గురుకులాల్లో కల్తీ ఫుడ్ ఘటనల పై చర్యలు తీసుకుంటున్నామని, అధికారులు నిరంతరం గురుకులాలను సందర్శించేలా చూస్తున్నామని తెలిపారు.
రూ.491 కోట్లతో మెరుగైన సేవలు అందిస్తున్నామని చెప్పారు మంత్రి సీతక్క. గత ప్రభుత్వంలోనే చాలా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, తమ ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లిస్తోందని అన్నారు. గురుకులాలలో విద్యార్థులకు అన్ని రకాల ఛార్జెస్ పెంచినట్లు తెలిపారు.