బండి సంజయ్‌‌‌‌ క్షమాపణ చెప్పాలి

  • కేబినెట్‌‌‌‌లో అర్బన్‌‌‌‌ నక్సల్స్‌‌‌‌ ఉన్నారనడం తగదు : మంత్రి సీతక్క
  • విప్లవ భావజాలం కలిగిన నేతలు బీజేపీలో పనిచేస్తలేరా అని ప్రశ్న

మహబూబాబాద్, వెలుగు : రాష్ట్ర కేబినెట్‌‌‌‌లో అర్బన్‌‌‌‌ నక్సల్స్‌‌‌‌ ఉన్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అనడం తగదని, ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్‌‌‌‌ చేశారు. ఆదివారం మహబూబాబాద్‌‌‌‌లో జరిగిన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. నక్సల్స్ జనజీవన స్రవంతిలో కలిసి ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడాలని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిస్తుంటే.. బండి సంజయ్ అందుకు విరుద్ధంగా ప్రకటనలు చేయడం ఏంటని మండిపడ్డారు. 

వెనుకబడిన ఆదివాసీ కులాలకు చెందిన తమలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండొద్దా ? అని నిలదీశారు. తానేమీ దొడ్డి దారిన అధికారంలోకి రాలేదని, ములుగు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు. రాజకీయాల్లో సాధారణ కులాలకు చెందిన మహిళలు ఉండొద్దా ? అగ్రకులాల వారు మాత్రమే పెత్తనం చెలాయించాలా ? అని ఆమె ప్రశ్నించారు. 

వ్యక్తిగతంగా తనను కలిసిన టైంలో వీరవనిత అని పొగిడిన బండి సంజయ్.. ఇటీవల పదేపదే విమర్శలు చేయడమేమిటన్నారు. బీజేపీలో ఉన్న ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ ఏ భావజాలం నుంచి వచ్చారో చెప్పాలని డిమాండ్‌‌‌‌ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేస్తుంటే సహించలేకపోతున్నారన్నారు. కొంతమంది రాజకీయ ప్రత్యర్థులు తన ఫొటోలను మార్పింగ్ చేసి, ట్రోల్స్‌‌‌‌ చేస్తున్నారని వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. 

రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఉన్నత విద్యావంతుడని ఆయనకు రాష్ట్ర విద్యా పరిరక్షణ బాధ్యతలు అప్పగించడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. అణగారిన బిడ్డలకు అధికారం రావడాన్ని మతతత్వవాదులు జీర్ణించుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. సమావేశంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్‌‌‌‌ పాల్గొన్నారు.