పేదలకు స్కాలర్‌‌షిప్స్ అందించడం అభినందనీయం : మంత్రి సీతక్క

పేదలకు స్కాలర్‌‌షిప్స్ అందించడం అభినందనీయం : మంత్రి సీతక్క
  • మలబార్ సొసైటీ ఆధ్వర్యంలో 340 మంది పేద బాలికలకు స్కాలర్ షిప్స్ పంపిణీ

ములుగు, వెలుగు : కష్టపడి తరతరాల కోసం ఆస్తులు కూడబెట్టడంతో పాటు దాన గుణంతో పేదలకు సాయం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) పిలుపునిచ్చారు. విద్యార్థులు కష్టపడి చదువుతూ ఉన్నత కొలువుల్లో రాణించాలని సూచించారు. ఆదివారం ములుగు డీఎల్ ఆర్ ఫంక్షన్ హాల్ లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 340 మంది బాలికలకు రూ.10వేల చొప్పున స్కాలర్ షిప్స్ అందించగా మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

బాలికలు, మహిళల సాధికారత కోసం, పేద బిడ్డల అభ్యున్నతి కోసం 340మంది బాలికలకు స్కాలర్షిప్స్ అందించడం హర్షణీయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 116 కళాశాలల్లో చదువుతున్న 3,900 మంది బాలికల విద్యకు మద్దతుగా ఉపకార వేతనాలు అందించడం గొప్ప విషయం అన్నారు. రూ.3.14 కోట్లు బాలికల చదువుకు కేటాయించడం సంతోషకరమని అన్నారు. మలబార్ గోల్డ్ అండ్  డైమండ్స్ జోనల్ హెడ్ కె. రాకేశ్ రెడ్డి, మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా 21,000 మంది బాలికల విద్యకు మద్దతుగా రూ.16 కోట్లను కేటాయించామన్నారు.

 సమాజంలో యువతులకు ఉన్న అడ్డంకులను తొలగించడానికి కట్టుబడి ఉన్నామన్నారు. మలబార్ గ్రూపు లాభాలలో 5 శాతం విద్య ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పేదరిక నిర్మూలన వంటి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మలబార్ గోల్డ్, డైమండ్స్ వరంగల్ షోరూం హెడ్ అజీశ్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.