
- కట్టడి చేస్తామన్నసీఎం ప్రకటనతో రిలీఫ్ లభించిందన్న మంత్రి
హైదరాబాద్, వెలుగు: సోషల్ మీడియాతో ప్రతిరోజూ బాధపడుతున్నానని.. తప్పుడు పోస్టులు, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలతో మానసిక క్షోభకు గురిచేస్తున్నారని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని కూడా తప్పుగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని వాపోయారు. శనివారం అసెంబ్లీ లాబీల్లో మీడియాతో సీతక్క చిట్‌చాట్ చేశారు.
గత కొన్నేండ్లుగా సోషల్ మీడియా వల్ల ఎంతో బాధపడుతున్నానని, వ్యక్తిత్వ హననం చేస్తుండడంతో డీమోరల్ అయ్యానని ఆమె చెప్పారు. సోషల్ మీడియాను కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నదని, దీనిపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయడంతో ఎంతో రిలీఫ్ లభించిందని తెలిపారు. ‘‘మహిళలు రాజకీయాల్లో ఎదగడమే కష్టం. అలాంటిది గిరిజన ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి అయ్యాను. నేను కష్టపడి ఈ స్థాయికి వస్తే ఇబ్బంది పెడుతున్నారు.
కరోనా టైమ్‌లో సోషల్ మీడియాను సోషల్ సర్వీస్‌కు ఉపయోగించుకున్నా.. ఎంతో ఇబ్బంది పెట్టారు. సోషల్ మీడియాను బీఆర్ఎస్ అబద్ధాలకు వాడుకుంటున్నది. కుటుంబాలను బజారుకీడుస్తున్నది. బాడీ షేమింగ్ చేస్తూ , ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేస్తూ.. అననివి అన్నట్లుగా చెబుతూ అసత్య ప్రచారం చేస్తున్నది. మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాపై సోషల్ మీడియాలో దాడి మరింత పెరిగింది. సోషల్ మీడియా ద్వారా అబద్ధాలను ప్రచారం చేస్తూ మాపై బురద జల్లుతున్నారు. అది కడుక్కోవడం మా వంతు అవుతున్నది” అని సీతక్క ఆవేదన చెందారు.