వచ్చే మహా జాతర కోసం మేడారంలో శాశ్వత అభివృద్ధి పనులు చేపడతామని మంత్రి సీతక్క తెలిపారు. మేడారం జాతరలో డ్యూటీ చేసిన ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్, జిల్లా అడిషనల్ కలెక్టర్లు పి.శ్రీజ, వేణుగోపాల్, డీఎస్పీ రవీందర్ ను ఆదివారం ఆమె సన్మానించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. జాతరను విజయవంతం చేసేందుకు కృషి చేసిన ప్రతి ఉద్యోగికి ధన్యవాదాలు తెలిపారు.
‘‘భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు కష్టపడ్డారు. 20 శాఖలకు చెందిన అధికారుల పనితీరు అభినందనీయం. జాతరలో పని చేసిన ఉద్యోగులు తమ అనుభవాన్ని ఒక లేఖ రూపంలో మాకు అందించాలి. వచ్చే జాతరలో భక్తులకు మరిన్ని మెరుగైన సేవలు అందించడానికి మీ సూచనలు, సలహాలు ఉపయోగపడతాయి.
మేడారంలో శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టి, వచ్చే జాతరలో భక్తులకు మెరుగైన సేవలు అందిస్తాం” అని చెప్పారు. జాతర ముగిసిన కుడా భక్తుల రద్దీ కొనసాగుతున్నదని పేర్కొన్నారు. మేడారం పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య పనులు నిరంతరం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు.