హరీశ్ రావు.. అబద్ధాలు చెప్పడం మానుకో..: మంత్రి సీతక్క

  • పని పూర్తి కాకుండానే బిల్లులు చెల్లించాలా? అని ఫైర్

హైదరాబాద్, వెలుగు : నిత్యం మీడియాలో ఉండేందుకు మాజీ మంత్రి హరీశ్ రావు పాకులాడుతున్నారని, ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. జగిత్యాల జిల్లా తొంబరావుపేట గ్రామంలో జీపీ భవన నిర్మాణానికి సంబంధించి రూ.17లక్షల బిల్లులు పెండింగ్​లో ఉన్నట్లు ఓ పత్రికలో వార్త వచ్చిందని, నిజమేంటో చెక్ చేయకుండానే దాన్ని హరీశ్ ట్వీట్ చేశారని విమర్శించారు. ఇప్పటికైనా అబద్ధాలు చెప్పడం మానుకోవాలని సూచించారు.

గత నెల 19న మాజీ సర్పంచ్ మామిడి సత్తమ్మకు రూ.7.46 లక్షల చెక్ ఇవ్వగా.. అక్టోబర్ 23న డబ్బులు విత్ డ్రా చేసుకున్నట్లు అధికారులు మంత్రి సీతక్క దృష్టికి తీసుకొచ్చారు. ఇంకా జీపీ భవన నిర్మాణం పూర్తి కాలేదని, ప్లాస్టరింగ్ పనులు పెండింగ్​లో ఉన్నాయని, అవి పూర్తి చేసిన తర్వాత బిల్లులు సమర్పించాలని మాజీ సర్పంచ్​కు అధికారులు సూచించారు. ఇప్పటి వరకు బిల్లులు సమర్పించలేదని జిల్లా అధికారులు మంత్రికి నివేదిక ఇచ్చారు.

ఈ మేరకు సీతక్క శనివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘‘ఓ మీడియాలో వచ్చిన కథనంపై వాస్తమేంటో తెలుసుకోకుండా హరీశ్ ట్వీట్ చేయడం సరికాదు. లేని అంశాలు ఉన్నట్లు భ్రమింపజేయడం మానుకోవాలి. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ అధికారంలోకి వచ్చేందుకు హరీశ్ ఆరాటపడ్తున్నడు. సెంటిమెంట్ రాజకీయాలే హరీశ్ రావు నైజం. జీపీ భవనానికి సంబంధించి రూ.7,46,787 చెల్లింపులు జరిగాయి.

మిగిలిన పనులు కంప్లీట్ చేస్తే మొత్తం బిల్లులు చెల్లిస్తం’’అని సీతక్క పేర్కొన్నారు. పనులు పూర్తి కాకుండానే బిల్లులు చెల్లించాలా? అని హరీశ్​రావును సీతక్క ప్రశ్నించారు. అధికారం దూరం కావడాన్ని హరీశ్ తట్టుకోలేపోతున్నారని విమర్శించారు. తమ బాధలను.. ప్రజల బాధగా ప్రచారం చేయొద్దని హితవు పలికారు. బీఆర్ఎస్ హయాంలో బిల్లులు చెల్లించక సర్పంచ్​లు ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని మరిచిపోవద్దని గుర్తు చేశారు.