అటవీ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టుతున్న బీజేపీ : మంత్రి సీతక్క

  • మంత్రి సీతక్క ఫైర్

ఆసిఫాబాద్, వెలుగు : బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న వేలాది ఎకరాల అడవీ సంపదను అదానీ, అంబానీలు, కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతోందని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు.  అమాయక ప్రజలపై కేసులు పెడుతున్నారని, ఫారెస్ట్ అధికారులు అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. గురువారం డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు ఇంట్లో మీడియాతో చిట్​చాట్ చేశారు. ఇందన్​పల్లి గ్రామంలో చేపలు పట్టిన పేద ప్రజలపై కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.

ఆనాడు అడవితో బ్రిటిషోళ్లు వ్యాపారం చేస్తే ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు కట్టబెడుతోందని విమర్శించారు. గుజరాత్​లో మొత్తం ప్రైవేట్ చేశారని, కేంద్రీయ యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు తొలగించారని, రానున్న రోజుల్లో దేశం మొత్తం రిజర్వేషన్లు తొలగించే కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రజలు చైతన్య వంతులయ్యారని, ఆ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అమలు చేస్తుందని చెప్పారు. కొత్త జిల్లాలను తొలగించే ఆలోచన కాంగ్రెస్​కు లేదన్నారు. రాహుల్ గాంధీ పీఎం కావడం ఖాయమని చెప్పారు.

జిల్లా కేంద్రంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు ఇస్తామన్నారు. కడెం ప్రాజెక్టు రిపేర్ కోసం రూ.9 కోట్లు రిలీజ్ చేశామని, ఎన్నికల తర్వాత కుమ్రంభీం ప్రాజెక్టు కెనాల్స్ కంప్లీట్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు, నాయకులు శ్యామ్ నాయక్, అనిల్ గౌడ్, మసాదే చరణ్, వసంత్ రావు, అసద్ తదితరులు పాల్గొన్నారు.