మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన్రు...హరీశ్ రావుపై మంత్రి సీతక్క ఫైర్

మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన్రు...హరీశ్ రావుపై మంత్రి సీతక్క ఫైర్
  • సంక్షేమం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు
  • రూ.550 కోట్ల పొదుపు డబ్బులు కొల్లగొట్టిన్రు
  • బతుకమ్మ చీరలకు మించిఖర్చు చేశామని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ‘‘మహిళా బ్యాంకులు ఏర్పాటు చేస్తామని చెప్పి మోసం చేసిన్రు. జిల్లా కేంద్రాల్లో మహిళా పారిశ్రామిక వాడలు, సంక్షేమ బోర్డు ఏర్పాటు హామీ ఏమైంది? ఆడ పిల్ల పుట్టిన నెలలోనే డబ్బులు ఫిక్స్ డిపాజిట్ చేస్తామన్నరు.. ఎస్సీ, ఎస్టీ, పేద గృహిణులకు మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తామన్నరు.. ఈ హామీలన్నీ నెరవేర్చడానికి మీకు తొమ్మిదిన్నరేండ్ల సమయం సరిపోలేదా?’’అని హరీశ్ రావుపై సీతక్క ప్రకటనలో మండిపడ్డారు. 

ఏడాదిలోనే అన్ని హామీలు అమలు చేయాలని మీరు ఆశించడం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. అభయహస్తం కింద మహిళలు దాచుకున్న పొదుపు డబ్బులు రూ.550 కోట్లనూ కొల్లగొట్టారని మండిపడ్డారు. అధికారంలో ఉండి అక్కాచెల్లెమ్మల కష్టార్జితాన్ని కాజేసిన బీఆర్ఎస్​కు.. మహిళల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పాలనలో మహిళలపై లక్షన్నరకు పైగా నేరాలు, అఘాయిత్యాలు జరిగాయని తెలిపారు. 

బతుకమ్మ చీరలకంటే పది రెట్లు ఖర్చు పెట్టినం

క్వాలిటీలేని బతుకమ్మ చీరలు ఇచ్చి మహిళల ఆత్మగౌరవాన్ని బీఆర్ఎస్ కించపర్చిందని సీతక్క మండిపడ్డారు. ‘‘మహిళలకు బతుకమ్మ చీరలకు మించి ఆర్థిక ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తున్నది. బతుకమ్మ చీరల కోసం గత బీఆర్ఎస్ సర్కార్ ఏడాదికి ఖర్చు పెట్టింది రూ.300 కోట్లు మాత్రమే.. మేము మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించేందుకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నం.

మొన్నటి దాకా దాదాపు 98.50 కోట్ల మంది అక్కాచెల్లెమ్మలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నరు. ఫ్రీ జర్నీ విలువ అక్షరాల రూ.3,325 కోట్లు. ఆడబిడ్డలు సగటున నెలకు రూ.332 కోట్లు ఆదా చేసుకున్నరు. బతుకమ్మ చీరల కోసం బీఆర్ఎస్ సర్కార్ ఖర్చు చేసినదానికంటే పది రెట్లు ఎక్కువ. మహిళా సంఘాల రూ.400 కోట్ల వడ్డీని ప్రభుత్వమే చెల్లించింది. మరో వెయ్యి కోట్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నది’’అని సీతక్క తెలిపారు.