విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవు : మంత్రి సీతక్క

హైదరాబాద్: హస్టల్ ఉండే విద్యార్థులను అధికారులు తమ సొంత పిల్లలుగా భావించాలని మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క సూచించారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. సచివాలయంలో గిరిజన ఆశ్రమ పాఠశాలు, హాస్టళ్లు, గురుకులాలు, విద్యాబోధన, వసతి, భోజనం తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశానికి గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి శరత్, గురుకుల కార్యదర్శి సీతాలక్ష్మీ, ఐటిడిఏ పీవోలు, డిప్యూటీ డైరెక్టర్లు, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారులు, వార్డెన్లు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. విద్యార్థులే తమ ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యమని తెలిపారు. వారి సమస్యలు పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. వర్షాకాలంలో టీచర్లు, వార్డెన్లు పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని, ఒకవేళ అనారోగ్యం పాలైతే ఇంటికి పంపకుండా మెరుగైన వైద్యం చేయించాలని తెలిపారు. పిల్లలు వాగుల, నదుల వద్దకు వెళ్లకుండా హాస్టల్ పిల్లలను సొంతవారిగా చూసుకోవాలని, హాస్టల్స్ అంటే సొంత ఇంటిలా ఫీల్ అవ్వాలని వెల్లడించారు. వారికి నాణ్యమైన భోజనం అందించాలని, కాచి చల్లార్చిన నీటిని ఇవ్వాలని సూచించారు. 

అప్పుడే దేవుడు మంచిగా చూస్తాడని వెల్లడించారు. అధికారులు తప్పకుండా మెనూ పాటించాలని, సరుకుల సరఫరా సరిగా లేకపోతే టెండర్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. చిన్న చిన్న సమస్యలను బుతద్దంలో చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఉద్యోగుల స్థైర్యాన్ని దెబ్బతీసేలా కొందరు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అందుకు అధికారులు జాగ్రత్తగా పనిచేయాలన్నారు. ఎస్టీ సంక్షేమశాఖ సీఎం వద్ద ఉందని, ఎస్టీ విద్యార్థుల పట్ల ప్రత్యేత శ్రద్ధ చూపిస్తున్నారని వెల్లడించారు.