ములుగు, వెలుగు: ప్రభుత్వ పథకాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంత్రి సీతక్క దిశా నిర్దేశం చేశారు. ములుగు మండలం ఇంచేర్ల ఎంఆర్ గార్డెన్ లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ అధ్యక్షతన శనివారం ములుగు, వెంకటాపూర్ మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలందరూ సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.
ములుగు నియోజకవర్గంలో సుమారు రూ.30 కోట్ల సీడీఎఫ్ నిధులతో దళిత గిరిజన వాడల్లో సీసీ రోడ్స్, డ్రైనేజీలు, కల్వర్టులు మంజూరు చేశామని, ములుగు నూతన బస్టాండ్, ఏటూరునాగారంలో బస్ డిపోకు రూ.80 కోట్లు, బీటీ రోడ్లకు సుమారు రూ.310 కోట్లతో పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. నాయకులు, కార్యకర్తలకు మధ్య ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్ తోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ లీడర్లు
కొత్తగూడ : మహబూబాబాద్జిల్లా కొత్తగూడ, గాంధీనగర్‌లోని బీఆర్ఎస్లీడర్లు శనివారం కాంగ్రెస్‌లో చేరారు. ములుగులోని మంత్రి సీతక్క క్యాంపు ఆఫీస్‌లో కాంగ్రెస్‌లో చేరిన లీడర్లకు మంత్రి పార్టీ కండువాలు కప్పి అహ్వానించారు. కొత్తగూడకు చెందిన యాదగిరి కిరణ్‌కుమార్, గాంధీనగర్‌కు చెందిన కిషన్, నాగేశ్వర్రావు, సురేశ్‌తోపాటు 10 మంది పార్టీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు వజ్జ సారయ్య, మాజీ సర్పంచ్ మల్లెల రణధీర్, వీరనేని వేంకటేశ్వర్రావు, సిద్దబోయిన లక్ష్మీనారాయణ, కంగాల నాగేశ్వర్రావు ఉన్నారు.