ములుగు (గోవిందరావుపేట), వెలుగు : అంతరాలు లేని సమాజ నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి సీతక్క సూచించారు. స్వచ్ఛంద సంస్థలు గ్రామీణ ప్రాంతాలకు తరలివచ్చి అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ములుగు జిల్లాకు వచ్చిన 50 కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామంలోని లక్నవరంలో శనివారం నిర్వహించిన సమావేశానికి కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలిసి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ అనేక సంస్థలు నగరాల చుట్టూ ఉన్న ప్రాంతాల అభివృద్ధి వైపే మొగ్గు చూపుతున్నాయని, నిజానికి వాటి అవసరం ములుగు వంటి మారుమూల జిల్లాలకే ఉందన్నారు.
స్వచ్ఛంద సంస్థలు గ్రామీణ ప్రాంతాలకు రావడం వల్ల భిన్నమైన వాతావరణం ఏర్పడుతుందని, దీని వల్ల గ్రామాలు త్వరగా అభివృద్ధి చెందుతాయన్నారు. వెనుకబడిన ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి వైపు తీసుకెళ్లాలి, స్థానిక యువతకు ఎలాంటి నైపుణ్య శిక్షణ ఇవ్వాలి, మహిళలకు కల్పించే ఉపాధి అవకాశాలు ఏంటి ? అనే అంశాలపై చర్చించే అవకాశం ఉంటుందన్నారు. ఒక్కో సంస్థ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకొని సీఎస్‌ఆర్ నిధులతో అభివృద్ధి చేయాలని కోరారు.
ములుగు ప్రాంతానికి వచ్చిన స్వచ్ఛంద సంస్థలకు జిల్లా యంత్రాంగం తరఫున సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అంతకుముందు గోవిందరావుపేట మండలంలోని రాంనగర్ పంచాయతీ పరిధిలోని ఎల్‌బీనగర్, మాన్యాతండాలో జరిగిన గ్రామసభలో కలెక్టర్, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశంలో నిర్మాణ్ సంస్థ సీఈవో మయూర్, తహసీల్దార్ సృజన్‌కుమార్, ఎంపీడీవో జవహర్ రెడ్డి, ఎంపీవో శరత్, పంచాయతీ కార్యదర్శి స్వర్ణ పాల్గొన్నారు.