- పేదల స్కీమ్స్లో కోతలు పెట్టొద్దు:
- సంక్షేమ నిధులు పెంచండి
- కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన మంత్రి సీతక్క
- ఆగ్రా సదస్సులో ప్రజెంటేషన్
హైదరాబాద్, వెలుగు:పెరిగిన ధరలకు అనుగుణంగా సంక్షేమ నిధులు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి సీతక్క కోరారు. పథకాల్లోనూ లోటుపాట్లను సవరించాలన్నారు. యూపీలోని ఆగ్రాలో ‘‘సామాజిక న్యాయం, సంక్షేమ పథకాల అమలు తీరు’’పై రెండు రోజులపాటు మేధో మదనం (చింతన్ శివిర్) నిర్వహిం చారు.
రెండో రోజైన మంగళవారం.. షెడ్యూల్ కులాలు, వయో వృద్ధులు, డ్రగ్స్ బాధితులు, ట్రాన్స్జెండర్లు, సంచార జాతుల సంక్షేమంపై చర్చ జరిగింది. బడుగు బలహీన వర్గాల కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్స్ గురించి మంత్రి సీతక్క ప్రజెంటేషన్ ఇచ్చారు.
‘‘తెలంగాణలో దివ్యాంగులకు ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్‌లు ఇస్తున్నం. ఆదర్శ పెండ్లిళ్లకు లక్ష రూపాయల నగదు ప్రోత్సహకం అందిస్తున్నం. స్వయం ఉపాధి కోసం దివ్యాంగులకు రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తున్నం. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేశాం’’అని సీతక్క అన్నారు.
తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా మారుస్తున్నం
పదేండ్లుగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇచ్చే పింఛన్లలో.. కేంద్ర ప్రభుత్వం తన వాటా పెంచలేదని మంత్రి సీతక్క అన్నారు. దీంతో రాష్ట్రాలపై ఆర్థిక భారం పడుతున్నదని తెలిపారు. లబ్ధిదారుల్లో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారని చెప్పారు.
‘‘తీసుకుంటున్నం. మిషన్ పరివర్తన నినాదంతో స్కూళ్లు, కాలేజీలు, పని ప్రదేశాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడ్తున్నం. విద్యాశాఖలో మాదకద్రవ్యాల నిరోధక కమిటీలు ఏర్పాటు చేస్తున్నం. పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. కుటుంబాలు, కుటుంబ సభ్యులు పెరిగినా.. రేషన్ కోటాలో కేంద్రం తన వాటా పెంచడం లేదు.
ఫుడ్ సెక్యూరిటీ కార్డుల కోసం కేంద్రం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి. స్కూల్స్‌లో మధ్యాహ్న భోజనం తరహాలోనే బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ప్రారంభించే అంశాన్ని పరిశీలించాలి’’అని సీతక్క అన్నారు. ములుగులో రూ.5లక్షలతో ఏర్పాటు చేసిన కంటైనర్ హాస్పిటల్ ఆదివాసీలకు ఎంతో ఉపయోగపడుతున్నని తెలిపారు. దేశవ్యాప్తంగా ఇలాంటి హాస్పిటల్స్ ప్రారంభించాలన్నారు.
Also Read:-కేజీబీవీకి కొత్త టీచర్లు..ఖాళీల భర్తీకి సర్కార్ నిర్ణయం
లైంగికదాడికి గురైన వారికి సత్వర న్యాయం అందేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు విస్తృతం చేయాలని కోరారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కేంద్రానికి చేసిన సూచనలపై మంత్రి సీతక్కను కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్‌తో పాటు పలు రాష్ట్రాల మంత్రులు ప్రత్యేకంగా కలిసి అభినందించారు.