తెలంగాణ, దేశ కీర్తిని చాటేలా క్రీడాకారులందరినీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి సీతక్క అన్నారు. అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని సీతక్క హామీ ఇచ్చారు. ఒలింపిక్స్ లో భారత్ తరపున పాల్గొనేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం కోయ నర్సాపురం గ్రామానికి చెందిన అథ్లెట్ పాయం కుమారి సిద్ధమవుతున్నారు. ఛత్తీస్ గఢ్ లో ప్రత్యేకంగా శిక్షణ పొందుతున్నారు. అయితే నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన కుమారి ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది.
ఈ క్రమంలో సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డితో సచివాలయంలో సీతక్కను కలిసి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన మంత్రి సీతక్క.. భద్రాచలం ఐటిడిఏ అధికారులతో మాట్లాడారు. అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. తక్షణ సహాయం కింద వ్యక్తిగతంగా 5 వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు మంత్రి సీతక్క. జాతీయ, అంతర్జాతీయ క్రీడా వేదికలపై తెలంగాణ, దేశ కీర్తిని చాటేలా క్రీడాకారులందరినీ తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, అన్ని రకాలుగా ఆదుకుంటుందని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.