- ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం.. అదే కాంగ్రెస్ గ్యారంటీ
- ఎలక్షన్ కోడ్ వల్ల ఇందిరమ్మ ఇండ్లు, రైతుబంధు ఆగినయ్
- రాహుల్‌గాంధీ కోసం బలరాంనాయక్‌ను గెలిపించాలి
- ఏటూరునాగారం కార్యకర్తల సమావేశంలో మంత్రి సీతక్క
ఏటూరునాగారం, వెలుగు: పదేండ్ల మోదీ పాలనలో దేశంలో ఆకలి చావులు పెరిగాయి తప్ప, పేదల అభివృద్ధి జరగలేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. బుధవారం మలుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం కార్యకర్తలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ గత కాంగ్రెస్ పాలనలో కులమతాలకు అతీతంగా ప్రజలకు రేషన్ కార్డులు, ఉపాధి హామీ పనుల ద్వారా జీవన భృతి కల్పించిదన్నారు.
పదేండ్ల బీజేపీ, బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. రూ.500 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను మోదీ సర్కార్ రూ.1000 పైగా పెంచి పేదలపై పెను భారం మోపిందన్నారు. అందుకే 6 గ్యారంటీల్లో భాగంగా తమ ప్రభుత్వం రాష్ట్రంలో రూ.500 గ్యాస్ సిలిండర్ ఇస్తుందన్నారు. తాము ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామన్నారు. కోడ్ వల్లనే ఇందిరమ్మ ఇండ్లు, రైతుబంధు తదితర హామీలు ఆగిపోయాయని తెలిపారు.
కోడ్ ముగిసిన వెంటనే అర్హులందరికీ పథకాలు అందిస్తామన్నారు. గతంలో కేంద్ర మంత్రిగా ఉండి ఏటూరునాగారం అభివృద్ధికి కృషి చేసిన పోరిక బలరాం నాయక్‌ను మరోసారి మహబూబాబాద్ ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి కానుకగా, రాహుల్ గాంధీని ప్రధాని చేయడం కోసం కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్, జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, బ్లాక్ అధ్యక్షుడు ఇరుసవడ్ల వెంకన్న, మండలాధ్యక్షుడు చిటమట రఘు, కన్నాయిగూడెం జడ్పీటీసీ నామ కరంచందుగాంధీ, నాయకులు అయూబ్‌ఖాన్, చెన్నూరిబాల రాజు, అప్సర్ పాషా, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మత సామరస్యానికి ప్రతీక రంజాన్
ములుగు, వెలుగు: రంజాన్ పండుగ మత సామరస్యానికి ప్రతీక అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క అన్నారు. పండుగను పురస్కరించుకొని బుధవారం ముస్లింలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ క్రమశిక్షణ, ఐకమత్యంతో మెలగడం, పేదలకు తోడ్పడటం రంజాన్ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమన్నారు.