- కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యం
- వర్క్ ప్లేస్లో మహిళలకు భద్రత కల్పించాలి
- సీఐఐ, ఇండియన్ విమెన్నెట్‌వర్క్ సదస్సులో మంత్రి సీతక్క
హైదరాబాద్/మాదాపూర్, వెలుగు: మహిళలు సవాళ్లను స్వీకరిస్తేనే గెలుపు సాధ్యమవుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. తనకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి వంటి పెద్ద శాఖను అప్పగిస్తే చాలెంజ్ గా తీసుకుని పట్టుదలగా పని చేస్తున్నానని తెలిపారు. శుక్రవారం మాదాపూర్ లోని టెక్ మహీంద్రా క్యాంపస్ లో సీఐఐ, ఇండియన్ వుమెన్ నెట్‌వర్క్ (ఐడబ్ల్యూఎన్), తెలంగాణ 10వ వార్షిక లీడర్‌షిప్ సదస్సును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. నేటికీ మహిళలపై వివక్షత కొనసాగుతుందని, దీని కారణంగా మహిళలు ఇంకా వెనుకబాటుకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పని ప్రదేశాల్లో మహిళలకు భద్రత కల్పించాలని, ఆ దిశగా పరిశ్రమలు, ప్రభుత్వం కలిసి పని చేయాలని కోరారు. వర్కింగ్ ఉమెన్స్ కు ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారం కోసం చట్టాలు చేస్తామని పేర్కొన్నారు. వ్యాపారాలు, పరిశ్రమలు గ్రామీణ ప్రాంతాల్లోనూ నెలకొల్పాలని సూచించారు. ప్రయాణాలు, పని ప్రాంతాల్లో మహిళల భద్రత కోసం తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సేఫ్ యాప్, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు.