- మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటుతో ఉపాధి
ములుగు, వెలుగు : మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. ములుగు ఏరియా హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్‌ను సోమవారం కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ శబరీశ్, అడిషనల్ కలెక్టర్ సంపత్‌రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం సింక్రోని, ఓపెన్ టెక్ట్స్ సంస్థల సహకారంతో, నిర్మాణ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గోవిందరావుపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో 130 మంది స్టూడెంట్లకు సైకిళ్లు పంపిణీ చేశారు.
ఆయ కార్యక్రమాల్లో మంత్రి సీతక్క మాట్లాడుతూ... కార్పొరేట్ కంపెనీల సహకారంతో ములుగు జిల్లాలో ఎనిమిది గ్రామాలను దత్తత తీసుకొని, రూ.2.5 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు చెప్పారు. ములుగులో బస్టాండ్ నిర్మాణానికి రూ. రూ.5.11 కోట్లు కేటాయించామని, ఏటూరునాగారంలో బస్ డిపో కోసం రూ.7 కోట్లు మంజూరయ్యాయన్నారు. జిల్లాకు చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు త్వరలోనే నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.
అనంతరం రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని ఆర్టీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి హాజరై వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు.
కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ జగదీశ్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ మోహన్‌లాల్, డీఎస్పీ రవీందర్, డీపీవో దేవరాజ్, ఏపీడీ బాలస్వామి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, కిసాన్‌సెల్ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్‌గౌడ్ పాల్గొన్నారు.