కుమ్రం భీం త్యాగ ఫలమే.. ఆదివాసీ, గిరిజన హక్కులు : మంత్రి సీతక్క

  • జోడేఘాట్ అభివృద్ధికి రూ. 5 కోట్ల నిధులు
  • ఆసిఫాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీం పోరాటం, త్యాగ ఫలితమే ఆదివాసుల, గిరిజనుల హక్కులని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసిరి సీతక్క పేర్కొన్నారు. భూమి కోసం, భుక్తి కోసం నైజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి అసువులు బాసిన కుమ్రం భీంను రాష్ట్రం మరువదని కొనియాడారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భీంకి, ఆదివాసీలు, గిరిజనులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.  ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కూడా రాష్ట్రంలో ఐటీడీఏ ద్వారా ఇండ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. సోమవారం ఆసిఫాబాద్​జిల్లాలో ఆమె విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశా రు.

మంత్రి మాట్లాడుతూ..  జోడేఘాట్ అభివృద్ధికి టూరిజం శాఖ నుంచి రూ. 5 కోట్ల నిధులు రిలీజ్ చేశామ ని, జోడేఘట్ ను టూరిస్ట్, హిస్టారికల్ ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కుమ్రంభీం వర్ధంతి, జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈనెల 17,18 తేదీల్లో ఎమ్మెల్యేలతో కలిసి ట్రైబల్ అడ్వైజర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి ఆదివాసుల అభివృద్ధిపై చర్చించి ప్రణాళికలు తయారు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, మద్యం తాగి, స్పీడ్ గా నడపవద్దని మంత్రి సూచించారు.

బీర్లు, బార్లకు పోయి వేలాదిగా ఖర్చు పెట్టె దాని కంటే హెల్మెట్ ప్రతి ఒక్కరూ కొనుగోలు చేయాలని,  ప్రమాద రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె కోరారు. జన్కాపూర్  లోని సబ్ జైల్ జంక్షన్ లో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో  భాగంగా  హెల్మెట్లను పంపిణీ చేసి ర్యాలీని ప్రారంభించారు.  మంత్రి వెంట కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు, అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారీ, డేవిడ్, ఏఎస్పీ చిత్తరంజన్ ,మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు , కుమ్రంభీం మనుమడు కుమ్రం సోనేరావు ,ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ చార్జ్ ఆత్రం సుగుణ, డీసీసీ ప్రెసిడెంట్ కొక్కిరాల విశ్వప్రసాద్ రావు తదితరులున్నారు. 

 సంప్రదాయాలు భావి తరాలకు అందించాలి 

ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను భావి తరాలకు అందించాల్సిన అవశ్యకత ఉందని మంత్రి సీతక్క సూచించారు.  కెరమెరి మండలంలోని మహారాజ్ గూడ సహ్యద్రి  పర్వతాల్లో కొలువు దీరిన జంగు బాయి పుణ్య క్షేత్రాన్ని ఆమె ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి దర్శించుకుని అమ్మవారి గుహలో ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి మాట్లాడుతూ ఆదివాసీ సమాజంలో  ప్రకృతి రూపంలో దేవుండ్లను ఆరాధిస్తామన్నారు. అడవుల్లో జీవిస్తున్నపటికి తమది ప్రత్యేక జీవన విధానమన్నారు. రూ.50 లక్షలతో జంగు బాయి పుణ్యక్షేత్రంలో మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. క్షేత్రానికి సంబంధించిన భూములకు పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు.


 ఆదివాసీ సంప్రదాయ చీర కట్టు 

 ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలో జంగుబాయి జాతర మహా పూజకు మంత్రి సీతక్క, ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఆదివాసీ సంప్రదాయ చీరకట్టుతో పాల్గొని తమ సంప్రదాయం గుర్తు చేశారు. జంగుబాయి పుణ్యక్షేత్రాన్ని  దర్శించుకుని, గుహలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కటోడాలను (పూజారులు) సన్మానించారు. జోడేఘాట్ లో కుమ్రంభీం విగ్రహం, సమాధికి నివాళులు అర్పించారు. ఆదివాసులకు దుప్పట్లు పంపిణీ చేశారు.