
ములుగు/ ఏటూరునాగారం, వెలుగు : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, సీఆర్ఎస్ నిధులతో కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడం హర్షణీయమని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. శనివారం ములుగు మండలంలో మంత్రి సొంతూరైన జగ్గన్నపేటను నిర్మాణ్ ఆర్గనైజేషన్, ఓపెన్ టెక్స్ట్ కార్పొరేట్ సంస్థలు దత్తతతీసుకున్నాయి. ఆ గ్రామంలో తమ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను అడిషనల్ కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్ రావుతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థల అధికారులు జిల్లాలోని ఏడు గ్రామాలను దత్తత తీసుకొని ప్రజలు నిర్ణయించిన పనులను పూర్తి చేయడం చెప్పుకోదగ్గ విషయమన్నారు.
జగ్గన్నపేటలో విద్యార్థులకు మరుగుదొడ్లు నిర్మించడం, ఆటవస్తువులను అందజేశారని, సోలార్ లైట్లు, వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి తాగునీటిని అందించనున్నారన్నారు. ఎల్బీనగర్ గ్రామ ప్రజల కోరిక మేరకు ఆటో, సైకిళ్లు, పాడి గేదెలను అందించారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతుండగా మరోవైపు కార్పొరేట్ సంస్థలు సీఎస్ఆర్ నిధులు వెచ్చిస్తూ కార్యక్రమం చేపట్టడం ఆభినందనీయమన్నారు. రూ.1.25 కోట్ల నిధులతో 5 గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి వివరించారు.
అనంతరం వెంకటాపూర్ మండలం ఇంచించెరువు పల్లెలో సర్వీస్ నౌ సంస్థ ద్వారా రూ.25.50 లక్షలతో గిరిజన గ్రామాన్ని దత్తత, అభివృద్ధి కార్యక్రమ పనులను మంత్రి, నిర్మాణ్ ఆర్గనైజేషన్, సర్వీస్ నౌ సంస్థ ప్రతినిధులు విద్యానంద, స్నేహలత, అదనపు కలెక్టర్లతో కలసి ప్రారంభించారు. ములుగు క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ అధ్యక్షతన జరిగిన గ్రామగ్రామాన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా మంత్రి సీతక్క, ఇన్చార్జి కైలేశ్నేత హాజరై ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి అధినేత రాహుల్ గాంధీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదానికి పిలుపునిచ్చారని, ఈ నినాదాన్ని క్షేత్ర స్థాయిలోకి ప్రతీ కార్యకర్త బలంగా తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగుల ఆత్మగౌరవమే ప్రథమ కర్తవ్యం
దివ్యాంగుల ఆత్మగౌరవమే ప్రజా ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని, వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపేందుకు వారికి సహాయ ఉపకరణాల పంపిణీ చేస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఏటూరునాగారంలోని గిరిజన భవన్ లో జిల్లా సంక్షేమ అధికారిణి కూచన శిరీష అధ్యక్షతన 297 మంది దివ్యాంగులకు రూ.40 లక్షలు విలువైన 525 వివిధ రకాల సహాయ ఉపకరణాలను మంత్రి అందజేశారు. అనంతరం శిథిలావస్థలో ఉన్న ఐటీడీఏ సిబ్బంది నివాస గృహాలను రిపేర్ చేసిన 40 క్వార్టర్స్ లను మంత్రి కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రాతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఐటీడీఏ కాంప్లెక్స్‌లో నందిని మహిళ పొదుపు సంఘం సభ్యులకు రూ. లక్షా 50 వేలతో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు అందించిన అంబలి తాగుతూ ఆరోగ్యానికి మంచిదని చెప్పారు. 50 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఏటూరునాగారంలోని చైతన్య మండల సమాఖ్య మహిళా సభ్యులకు వడ్డీ మాఫీ కింద రూ. 86,12, 641.00 విలువైన చెక్కును అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించడానికి ములుగు జిల్లాలోని చివరి ఊరు వరకూ ఆర్టీసీ బస్సును చేర్చడమే లక్ష్యంగా పెట్టుకుని ఏటూరునాగారంలో ఆర్టీసీ బస్సు డిపో నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్నారు. పనులు అతి త్వరలో ప్రారంభమవుతాయిని తెలిపారు.