- పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
- ఏటూరునాగారంలో కుమ్రం భీం విగ్రహావిష్కరణ
ఏటూరునాగారం, వెలుగు: చట్టాలు, హక్కుల కోసం పోరాడిన వారి గురించి భవిష్యత్‌తరాలకు తెలిసేలా విగ్రహాలు ఏర్పాటు చేయడం అభినందనీయం అని పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని వై జంక్షన్‌లో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుమ్రం భీం విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ కుమ్రం భీం ‘జల్, జంగిల్, జమీన్’ నినాదంతో పోరాటం చేసి వీరమరణం పొందారని గుర్తు చేశారు. భీం పోరాటాలు, అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తి నేటి తరాలకు అవసరం అన్నారు.
ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు ఏజెన్సీలోని పోడు భూములు, ఉద్యోగ, ఉపాధి సమస్యలతో పాటు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు వంటి సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డి, ఆదివాసీలతో రివ్యూ నిర్వహిస్తామని చెప్పారు. మహనీయుల విగ్రహాలను గౌరవించాలని సూచించారు. కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య, ఐటీడీఏ పీవో చిత్రా మిశ్ర, ఆల్ ఇండియా ఆదివాసీ జాతీయ కన్వీనర్ చందా లింగయ్య, ఏపీకి చెందిన ఎమ్మెల్యే మచ్చె లింగం, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్, ఆదివాసీ సంఘాల నాయకులు పొదెం రత్నం, కృష్ణప్రసాద్, కోడి వెంకట్, పొదెం బాబు పాల్గొన్నారు.