ములుగు, వెలుగు : ములుగు గట్టమ్మ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను మంత్రి సీతక్క శుక్రవారం పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్కు సూచించారు. గడువు లోగా పూర్తిచేయాలన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠితో మాట్లాడి అందుకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.
ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనులపై ఫోకస్ పెంచాలని సూచించారు. మంత్రి వెంట కలెక్టర్, ఎస్పీ ఉన్నారు. అనంతరం అంకన్నగూడెంలో బాలకుమారస్వామి జాతర లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. పూర్వీకులు ఇచ్చిన సంస్కృతీ, సాంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.