అభివృద్ధి పథంలో మొదటి అడుగు ఆదిలాబాద్ నుంచే.. : మంత్రి సీతక్క

అభివృద్ధి పథంలో మొదటి అడుగు ఆదిలాబాద్ నుంచే.. : మంత్రి సీతక్క

అభివృద్ధి పథంలో మొదటి అడుగు ఆదిలాబాద్ నుంచి పడుతుందని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడైన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ ఇంద్రవెల్లిలోనే జరిగిందని చెప్పారు. ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తితో దళిత గిరిజన దండోరా మోగించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. గురువారం(ఫిబ్రవరి 01) ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్తున్న సీతక్క మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుతో కలిసి ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. 

తొమ్మిన్నర సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను దోచుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని మంత్రి సీతక్క అన్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రాణహిత ప్రాజెక్టును పక్కనపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి దానిని అవినీతి కూపంగా మార్చారని విమర్శించారు. నిరుద్యోగుల ఆశలపై, ఆకాంక్షలపై నీళ్లు చల్లడం వల్లే కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టారని చెప్పారు. నర్సుల రిక్రూట్మెంట్ కు నోటిఫికేషన్ వేసి వదిలేస్తే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నియామకాలు చేపట్టామన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వందలాది గ్రామాల్లో తాగునీరు కరువైందని.. చాలా గ్రామాల్లో అంగన్వాడి సెంటర్లు కూడా లేకపోవడం వల్ల ఇక్కడ మహిళలు, పిల్లలు రక్తహీనతతో రోగాల బారిన పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత మళ్లీ ఇంద్రవెల్లి నుంచే అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారని సీతక్క తెలిపారు. శుక్రవారం(ఫిబ్రవరి 02) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి ముందుగా కేస్లాపూర్ లో పూజలు చేసిన అనంతరం ఇంద్రవెల్లిలో అమరవీరుల స్మృతి వనానికి భూమిపూజ చేస్తారన్నారు. మిషన్ భగీరథ స్కీం విఫలం కావడంతో ప్రజలు నీటి కోసం అల్లాడుతున్నారని, రేవంత్ రెడ్డి మంచినీటి పథకంతో పాటు పలు ప్రాజెక్టులను ఇంద్రవెల్లి నుంచి ప్రారంభిస్తారని సీతక్క తెలిపారు. ఆదివాసీ బిడ్డగా ఉమ్మడి ఆదిలాబాద్ ఆదివాసీల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఈ జిల్లా ఇన్చార్జి మంత్రిగా బాధ్యతలు చేపట్టడం తనకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇంద్రవెల్లి సభకు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆమె కోరారు.