- రాష్ట్రపతితో అన్ని అవాస్తవాలే చెప్పించారని విమర్శ
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరిస్తున్నదని మంత్రి సీతక్క ఒక ప్రకటనలో మండిపడ్డారు. అసలు సమస్యలను పక్కదారి పట్టించేలా వివాదాలు సృష్టించడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్యని ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగంలో కేంద్రం అన్ని అవాస్తవాలే చేర్చిందని, ఇది బీజేపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు.
సామాన్యులు, నిరుద్యో, ఆర్థికరంగ సమస్య ప్రస్తావన రాష్ట్రపతి ప్రసంగంలో లేదని, దీన్ని కప్పిపుచ్చేందుకే సోనియా వ్యాఖ్యలపై వివాదం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఆదివాసీ రాష్ట్రపతిని అవమానించేలా మోదీ నేతృత్వంలోని బీజేపీ వ్యవహరించిందన్నారు. కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకుండా బీజేపీ తన కురుచబుద్ధిని ప్రదర్శించిందన్నారు.
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. అటవీహక్కు చట్టాన్ని నీరుగార్చి, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇష్టారీతిన మైనింగ్ కు అనుమతులిస్తూ, పెసా చట్టాన్ని తుంగలో తొక్కిన బీజేపీ.. ఆదివాసీల గౌరవం గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.