పేదల కడుపు నింపడమే ధ్యేయం : పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

పేదల కడుపు నింపడమే ధ్యేయం : పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

ములుగు, వెంకటాపూర్​(రామప్ప), తాడ్వాయి, వెలుగు: పేదలకు కడుపునిండా తిండి పెట్టడమే ప్రభుత్వ ధ్యేయమని, దేశంలోనే చారిత్రాత్మకమైన సన్నబియ్యం పథకం తెలంగాణలో అమలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. త్వరలోనే అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్​ కార్డులు జారీ చేస్తామని పేర్కొన్నారు. బుధవారం ములుగు జిల్లా పర్యటనలో భాగంగా ములుగు, మల్లంపల్లి, వెంకటాపూర్​, గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్​ దివాకర, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్​ బానోతు రవిచందర్, అడిషనల్​ కలెక్టర్​ మహేందర్​ జీతో కలిసి మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఆహారభద్రతా చట్టం తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్​ దేనని, నాగార్జున సాగర్, ఎస్సారెస్పీ, తదితర సాగునీటి ప్రాజెక్టులను తెచ్చిందీ తామేనని వెల్లడించారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. ములుగు కార్యక్రమంలో స్థానిక రైతులు ములుగు శివారులోని లోకం చెరువు, తోగుంటలను అభివృద్ధి చేయాలని మంత్రికి విన్నవించారు. మంత్రి వెంటనే ఇరిగేషన్​ ఈఈకి ఫోన్​ చేసి లోకం చెరువు, తోగుంటలను పరిశీలించి, రైతుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం ములుగు బీసీ సంక్షేమ భవన్​లో జరిగిన సర్దార్​ సర్వాయి పాపన్న వర్థంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు.  గోవిందరావుపేట మండలం చల్వాయిలో మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించగా, మంత్రి సీతక్క భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సెర్ఫ్​ సీఈవో దివ్యతో కలిసి పాల్గొన్నారు.  

అనంతరం మహిళ సంఘాలకు చెక్కులను అందజేశారు. మల్లంపల్లి మండల కేంద్రంలో జై బాపు, జైభీమ్, జై సంవిధాన్​ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్​ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తాడ్వాయిలో ఎస్పీ శబరీశ్, పోలీస్ శాఖ ద్వారా జిల్లాలోని 84 గుత్తి కోయ గూడాలలోని గుత్తి కోయ గిరిజనులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయగా, మంత్రి సీతక్క చీఫ్​గెస్ట్​గా హాజరయ్యారు. మంత్రి ముందుగా గుత్తి కోయ గిరిజనుల   సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్య రాకుండా వాటర్ ట్యాంకర్లను గ్రామాలకు పంపిస్తామని, త్వరలో బోర్లు వేయిస్తామని తెలిపారు. గూడాలకు కొత్తవారిని తీసుకురావద్దని అడవులను నరకకుండా కాపాడాలని మంత్రి సూచించారు. అనంతరం గుత్తికోయ గిరిజన కుటుంబాలకు 10 రకాల నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.  అంతకుముందు 25 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులను అందజేశారు.

యాసంగి సన్నొడ్లు దిగుమతులు చేసుకోలేం..

యాసంగి సీజన్​లో సన్నధాన్యాన్ని దిగుమతి చేసుకోలేమని రైస్​మిల్లర్స్​అసోసియేషన్​ ములుగు జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్​ అన్నారు. సన్నరకం ధాన్యంలో 67శాతం బియ్యం అందించలేమని పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర మంత్రి సీతక్కను కలిసిన అసోసియేషన్​ సభ్యులు ఈమేరకు వినతిపత్రం అందజేశారు. వారి సమస్యను విన్న మంత్రి స్పందించి సివిల్​ సప్లై మంత్రి ఉత్తంకుమార్​ రెడ్డితో మాట్లాడి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు.