ఇథనాల్ ఫ్యాక్టరీ దోషులు కేసీఆర్, కేటీఆరే! : మంత్రి సీతక్క

ఇథనాల్ ఫ్యాక్టరీ దోషులు కేసీఆర్, కేటీఆరే! : మంత్రి సీతక్క
  • నాడు రైతులను ముంచి నేడు రెచ్చగొడ్తరా?: మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు:  నిర్మల్​ జిల్లా దిలావర్ పూర్​ మండలంలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు నాటి బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలే పర్మిషన్​ ఇచ్చాయని.. ఈ విషయంలో కేసీఆర్, కేటీఆర్​లే అసలైన దోషులని మంత్రి సీతక్క ఆరోపించారు. ‘ఇథనాల్​  కంపెనీ తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబానిది. ఆ ఫ్యాక్టరీ  ఏర్పాటుకు నీళ్లు, కరెంట్, పొల్యూషన్ కు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్ని అనుమతులిచ్చింది.

నాడు రైతులను ముంచే ఆలోచనలు చేసి.. ఇప్పుడు అదే రైతులను అధికారులపైకి ఉసిగొల్పి ప్రజా ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నది కేసీఆరే’  అని మంత్రి ఫైర్ అయ్యారు. అక్కడ ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేస్తున్నది పీఎంకే డిస్టిలేషన్ అని..ఇందు లో తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తల సాని సాయి కిరణ్, తలసాని అల్లుడు డైరెక్టర్లుగా ఉన్నారని చెప్పారు. బుధవారం ఆమె సెక్రటేరియెట్ లోని తన ఛాంబర్ లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి  మీడియాతో మాట్లాడారు.

జనాల్ని రెచ్చగొట్టడమే వాళ్ల అలవాటు

 అబద్ధాల పునాదులపై అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ కుటిల ప్రయత్నాలు చేస్తోందని మంత్రి సీతక్క మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇథనాల్​ కంపెనీకి సంబంధించి కొత్తగా ఎలాంటి ప్రక్రియ చేపట్టలేదని స్పష్టంచేశారు. అబద్ధాలు, దొంగ నాటకాలు ఆడటం, జనాల్ని రెచ్చగొట్టడం బీఆర్ఎస్ కు అలవాటు అయిపోయిందన్నారు. 

ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడేందుకు వెళ్లిన ఆర్డీవో పై బీఆర్ఎస్, బీజేపీ నాయకులు  దాడులు చేయడం ఎంత వరకు కరెక్ట్​అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఇష్టారీతిన విషం చిమ్ముతున్నారని, ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చినందుకు  అక్కడి ప్రజలకు కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పి, ముక్కు నేలకు రాయాలని మంత్రి డిమాండ్ చేశారు.